గుడ్ న్యూస్: నవంబర్ 15 నుంచి ఏపీలో..!!
అమరావతి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కుల గణనకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కులాల వారీగా సర్వే చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దీనికి ముహూర్తాన్ని పెట్టింది. నవంబర్ 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కుల గణన.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. బిహార్ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది. అనంతరం పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కులాలవారీగా సర్వే చేపట్టాయి. ఇప్పుడు ఏపీ.. ఈ జాబితాలో చేరనుంది. బీసీ కుల గణనను చేపట్టడానికి గతంలో ప్రభుత్వం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

కుల గణనను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించనుంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావించడం వల్ల వలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయట్లేదని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధి ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు.
వారు సేకరించిన లెక్కలపై అధికారులు రీవెరిఫికేషన్ నిర్వహిస్తారు. సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన గణన వివరాలను సరిపోల్చి చూస్తారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తుంది.
కులగణన సమయంలో ఆయా కుటుంబాల వారి నుంచి సేకరించిన డేటాను భద్రపర్చడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. ఈ యాప్ ఎలా ఉండాలనే విషయంపై అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.












Click it and Unblock the Notifications