విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఆ యువతిని అనారోగ్యం కబలించింది. యువతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి లేదన్న వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి(23).. విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇటీవల కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఉంటోంది. అక్కడే జాబ్ సెర్చింగ్ లో ఉంది.
అయితే మూడు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో మాట్లాడిన రాజ్యలక్ష్మి.. తనకు జలుబు, ఆయాసం వస్తోందని.. నవంబర్ 9న డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్టు తెలిపింది. అయితే గురువారం రాత్రి స్నేహితులతో కలిసి నిద్రపోయింది. అయితే ఉదయం స్నేహితులు నిద్రలేపినా రాజ్యలక్ష్మి లేవలేదు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక కూతురి మరణవార్త విన్న ఆ తల్లిదండ్రులు బోరున విలిపించారు. తల్లిదండ్రులిద్దరూ అచేతన స్థితిలోకి వెళ్లిపోయారని మృతురాలి సోదరుడు రాజా తెలిపారు. మరోవైపు రాజ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక ఈ ఘనటపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా పరామర్శించారు. వారిని ఓదార్చారు. ఈ ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications