హైదరాబాద్‌లోనే ఇద్దరు సిఎంలు: సమీక్షలో హోంశాఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల విభజన, ఇతర శాఖల విభజన అంశాలపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర విభజన ప్రక్రియను పరిశీలించేందుకు డిజి, అదనపు డిజి స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. శాంతి భద్రతల నిర్వహణలో పోలీస్ శాఖ కీలకమని, రాష్ట్ర విభజన అనంతరం ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ ఉన్నతాధికారులదేనని ఈ సమావేశంలో చెప్పారు.
ఈ సమావేశం సందర్భంగా పోలీస్ శాఖలో విభజన ప్రక్రియపై పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో శాంతిభద్రతలు, అంతర్గత అంశాలపై ఆయన మాట్లాడారు. కాగా, జూన్ 2 తర్వాత పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నగరంలోని ఉంటారని అనిల్ గోస్వామి చెప్పారు. అందువల్ల వారి భద్రతను, పర్యటనలను, కార్యక్రమాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లే చూసుకోవాలని ఆయన సూచించారు.

ఇప్పుడున్న సిబ్బంది సరిపోకపోయినట్లయితే అందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. సిఎంల అధికారిక నివాసాలు, మంత్రుల వసతి గృహ సముదాయాలు, శాసనసభ స్పీకర్లు, ఇతర ఉన్నతాధికారుల భద్రత వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షిస్తున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అంతేగాక తెలంగాణ, సీమాంధ్ర ప్రజల, నేతల, అవసరాల మేరకు పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా నగరంలో పోలీసు సిబ్బందిని పెంచాల్సిన అవసరముందని ఉన్నతాధికారులు అనిల్ గోస్వామి దృష్టికి తీసుకొచ్చారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ కీలకమైనందున ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 3,800 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయనకు వివరించారు. విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు అదనపు బలగాలు అవసరమవుతాయని తెలిపారు.
అప్పా లాంటి పోలీస్ శిక్షణా కేంద్రంతోపాటు గ్రేహౌండ్స్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, వీటితోపాటు ఇంకేమైనా సందేహాలు, ప్రతిపాదనలు ఉంటే తమకు తెలియజేయాలని అనిల్ గోస్వామి అన్నారు. ఈ సమావేశంలో డిజిపి ప్రసాదరావు, అదనపు డిజిలు మహేంద్రరెడ్డి, కౌముది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications