జగన్! ఏమంటావ్: ఏడ్చిన అనిత, భారత్-పాక్ మ్యాచ్‌ని లాగిన గీత, కోర్టులపై కాల్వ!
హైదరాబాద్: వైసిపి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో నేను, నా కుటుంబం ఎంతో మథన పడ్డామని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత సోమవారం నాడు శాసన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వైసిపి అధినేత జగన్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆమె ఓ సమయంలో కంటతడి పెట్టారు.
సామాజిక మాధ్యమాల్లో రోజా, అనిత అని సెర్చ్ చేస్తే, రోజా తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. తాను రోజాతో క్షమాపణలు మాత్రమే కోరానని తెలిపారు. రోజాను జగన్ వెనకేసుకురావడం దురదృష్టకరమన్నారు.
రోజాను రోజమ్మా అంటావ్.. కానీ నేను అనితమ్మను కాదా అని ప్రశ్నించారు. నీకు అక్కా, చెల్లి, భార్య ఉన్నారని, నేను నీకు సోదరిలాంటిని కాదా అని అడిగారు. ఈ రోజు జగన్ సభకు గైర్హాజరయ్యారని, ఇదేనై దళిత మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు.

బయట అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే జగన్, లోపల తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజా వ్యాఖ్యలతో నేను, నా పిల్లలు పడిన బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
రోజా తన పైన చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని, తనకు వ్యవస్థల పైన నమ్మకం ఉందన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా రోజా పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె క్షమాపణలకు అర్హత కోల్పోయారన్నారు. సభలో రోజా ఏనాడు ప్రజా సమస్యలపై చర్చించలేదన్నారు.
రోజా తన పైన బోండ ఉమ, తదితరులు ఆరోపణలు చేశారని చెబుతున్నారని, మరి ఎందుకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇలా మానసిక క్షోభకు గురి చేసే అంశాలు సభలో ఉండవద్దన్నారు. అసెంబ్లీ ఓ దేవాలయం అని, ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలన్నారు.
రోజాకు మీరు ఎంత శిక్ష విధించినా, నా మానసిక క్షోభకు సరిపోదన్నారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి, చట్టంపై నమ్మకం ఉంది కాబట్టి, రోజా పైన వేసే శిక్షను నేను స్వాగతిస్తానని చెప్పారు. నా బాధకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. రోజా తీరు చూసి మహిళా లోకమంతా నివ్వెరపోయిందని అన్నారు. రోజా సభకు క్షమాపణ చెప్పాలన్నారు. సభా సమయాన్ని వృథా చేసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. నగరి నియోజకవర్గ సమస్యల గురించి రోజా ఎప్పుడు మాట్లాడలేదన్నారు.
సభా గౌరవం తగ్గేలా వైసిపి ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో వైసిపి తీరు సరిగా లేదన్నారు. తీర్మానాల పేరుతో సభా సమయాన్ని వృథా చేశారన్నారు.
సభకు ఉన్న హక్కులను తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు. శాసన సభ అధికారాలు, హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బోండ ఉమ అన్నారు.
టిడిపి ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ... నిన్న పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ గురించి ప్రతి పత్రిక పతాక శీర్షికల్లో ఇస్తే సాక్షి పత్రిక మాత్రం అలా చేయలేదని ఎద్దేవా చేశారు. దీనిపై ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... అనాలోచితంగా తూలనాడినప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం, క్షమాపణలు చెప్పడం పరిపాటి అన్నారు. సభ్యులను నియంత్రించేందుకు చర్యలు తీసుకునే అధికారం చట్టసభలకు అందని చెప్పారు. శాసన సభలోని కార్యకలాపాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు. తద్వారా కోర్టులు తమను ప్రశ్నించలేవని అభిప్రాయపడ్డారు. సభ తీర్మానంపై రోజా కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications