సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సిద్ధమైన మరో రైలు మార్గం
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్, విజయవాడ, తెనాలి మీదుగా ఒక మార్గం ఉంది. గుంటూరు, తెనాలిమీదుగా మరో మార్గం, కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ మీదుగా మరో మార్గం ఉంది. ఇవి కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా నడికుడి-శ్రీకాళహస్తి మార్గం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నడికుడి జంక్షన్. ఇక్కడి నుంచి మాచర్ల వెళ్లవచ్చు. అలాగే గుంటూరు వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్లవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా గుండ్లకమ్మ-దర్శి మధ్య 27 కిలోమీటర్ల రైల్వేలైను ఇటీవలే పూర్తయింది.
ఒక్క రైతు వల్ల రైల్వేమార్గం ఆగిపోయింది
తాజాగా దర్శి నుంచి పొదిలి వరకు నిర్మించిన రైల్వే లైను ను అధికారులు పరిశీలించారు. గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ పూర్తయింది. పొదిలికి సమీపంలోని మల్లవరం వరకు నిర్మాణం పూర్తికాగా అక్కడి నుంచి పొదిలికి మార్గం పూర్తవలేదు. మధ్యలో స్థలం ఉన్న రైతు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత రైతుతో మాట్లాడి అక్కడి సమస్యను పరిష్కరించాలని అధికారులు కోరుతున్నారు. ఆ రైతువల్ల 200 మీటర్ల రైల్వే మార్గం నిర్మాణం ఆగిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నడికుడి నుంచి ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం నిర్మాణమవుతోంది. ఈ మార్గం శ్రీకాళహస్తి దగ్గర కలుస్తుంది. 309 కిలోమీటర్ల రైల్వే మార్గం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2300 కోట్లుగా ఉంది. ఈ మార్గంలో అన్నీ కొత్త రైల్వేస్టేషన్లే వస్తాయి.

ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు
ఇటీవలే దర్శి వరకు ప్యాసింజర్ రైలు నడిపారు. ఇది కూడా విజయవంతమైంది. నడికుడి నుంచి శావల్యాపురం వరకు, దర్శి, అద్ధంకి దగ్గర కూడా స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గం నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, శావల్యాపురం, దర్శి, అద్దంకి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మీదుగా వెళ్లి శ్రీకాళహస్తి దగ్గర కలుస్తుంది. పిడుగురాళ్ల, వినుకొండ, నడికుడి మినహా మిగతావన్నీ కొత్త రైల్వేస్టేషన్లు. ఈ ప్రాంతాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు సరకు రవాణా వేగవంతం అవుతుంది. ఎర్రమట్టి నేల కావడంతో ప్రకృతి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో వర్షాల వల్ల పట్టాలు మునిగిపోతే ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో రైళ్లు నడపవచ్చని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications