కృష్ణా నదిలో మరో పడవ ప్రమాదం...తృటిలో తప్పిన ముప్పు
విజయవాడ: కృష్ణా నదిలో మరో ప్రమాదం తృటిలో తప్పింది. బోటులో ప్రయాణికులతో పాటు పరిమితికి మించి ద్విచక్రవాహనాలను ఎక్కించుకున్న ఓ నాటు పడవ తీరాన్ని వీడగానే బోల్తాపడింది. అయితే నది ఒడ్డుకు కొద్ది దూరంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద ఈ ఘటన జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...ఎదురుమొండి నుంచి ఏటిమొగ వెళ్తున్న నాటు పడవలో ఆరుగురు ప్రయాణికులతోపాటు మూడు ద్విచక్రవాహనాలను ఎక్కించారు. పడవ కొద్దిదూరం వెళ్లగానే పడవ ఒక పక్కకు ఒరిగిపోయి తిరగబడింది. దీంతో అందులోని వాహనాలు, ప్రయాణికులు నీటిలో పడ్డారు. అయితే తీరానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరగలిగారు.

ఈ మార్గంలో నిత్యం ప్రయాణికులను ఎక్కించుకుని నడిపే పడవలను దివిసీమ పడవ పోటీలకు తరలించడంతో ఆ పడవలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేసథ్యంలోనే రాకపోకలకు మరోమార్గం లేక ప్రయాణికులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. పరిమితి దాటి కొంచెం బరువు ఎక్కువ వేసినా ఇవి వెంటనే తిరగబడిపోతాయి. ఈ నాటు పడవ ప్రమాదానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications