లెక్క తీస్తాం, ఎవరి వల్ల ఆగాయో ఆధారాలు చూపిస్తాం: బాబుకు బీజేపీ షాక్, 'షా భయపడి ఫోన్ చేశారా'
అమరావతి: మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేనలకు బీజేపీ నేతలు సోమవారం ధీటుగా సమాధానం చెప్పారు. ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని నిలదీశారు.
Recommended Video

గవర్నర్ ప్రసంగం అనంతరం బీజేపీ నేతలు ఆకుల సత్యనారాయణ, విష్ణు కుమార్ రాజులతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. టీడీపీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడారు. సభలో గట్టిగా తమ నినాదం వినిపించాలని నిర్ణయించారు.

లెక్కలతో సహా బీజేపీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇచ్చిందనే విషయమై లెక్కలతో సహా కమలం పార్టీ నేతలు అసెంబ్లీకి సిద్ధమయ్యారు. లెక్కలన్నీ సిద్ధం చేసుకున్న బీజేపీ నేతలు ఇక అసెంబ్లీలో ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే వారు టీడీపీపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అమిత్ షా భయపడి ఫోన్ చేశారా
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. హోదా కోసం టీడీపీ డిమాండ్ చేస్తుండటంతో తమ పార్టీ అధ్యక్షులు అమిత్ షా భయపడి చంద్రబాబుకు ఫోన్ చేశారని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఏరాష్ట్రాలకు పొడిగించలేదని ఎంపీ హరిబాబు చెప్పారని, కేంద్రం కూడా స్పష్టం చేసిందని చెప్పారు.

పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీపై, చంద్రబాబు ఓటుపై..
పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ)పై సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇలాంటి కమిటీలు చాలా ఉంటాయని చెప్పారు. జేఎఫ్‌సీ నివేదికను చూసిన తర్వాత తాము స్పందిస్తామన్నారు. ఎన్నికల్లో తాను ఓడినా 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనకు ఓటు లేదు.. నోటు లేదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. ఓ ఎంపీ మూడు నిమిషాలు చూసి చదివితే సన్మానాలు, ర్యాలీలా అని గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి అన్నారు.

బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నారు
11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందనేది అబద్దమని ఆకుల సత్యనారాయణ అన్నారు. బీజేపీని దెబ్బతీయాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లెక్కలు తీస్తాం, ప్రాజెక్టులు ఆగిపోయేందుకు కారణం చెబుతాం
కొన్ని రాజకీయా పార్టీలు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. ఏపీ అబివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలిసేలా సభ ముందుకు లెక్కలు తీసుకు వస్తామని చెప్పారు. ప్రాజెక్టులు నిలిచిపోవడానికి కారకులు ఎవరో ఆధారాలు చూపిస్తామని చెప్పారు.

పూర్తిగా నిధులు రాలేదు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. 2017 తర్వాత ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వమని కేంద్రం చెప్పిందని, అందుకే ప్యాకేజీకి అంగీకరించామని చెప్పారు.హోదా ఉన్న రాష్ట్రాలకు గతంలో వలే నిధులు ఇస్తున్నారని చెప్పారు. ఏపీకి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రాలేదన్నారు.












Click it and Unblock the Notifications