డ్రైవర్ లేని కారు: ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అసంతృప్తి
Chandrababu: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షం అంటూ లేకపోయినప్పటికీ అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సభ్యులే ఆ పాత్రను పోషిస్తోన్నారు. కూటమి ప్రభుత్వంలోని లోపాలు, నియోజకవర్గాల స్థాయిలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కోస్తా జిల్లాలకు చెందిన సీనియర్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇసుక పాలసీని ఆయన తప్పు పట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావట్లేదని తేల్చి చెప్పారు. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని, ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాలని సూచించారు. గత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ సభ్యుడు కూన రవికుమార్ గళం విప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగే జీరో అవర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తే సమస్యలు, అంశాల గురించి ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదని అన్నారు.
జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. దీనికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. మంత్రులు ఉన్నారని, వాళ్లు నోట్ చేసుకుంటున్నారని, నిండు సభలో అలా అసత్యాలు మాట్లాడకూడదని హితవు పలికారు. దీనికి కూన రవికుమార్ బదులిస్తూ 10 మంది మంత్రులు ఉన్నారని, ఎవరు నోట్ చేసుకుంటున్నారని చెప్పారు.
జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తే అంశాలను తాము నోట్ చేసుకున్నామంటూ ఒక మంత్రి లేచి సమాధానం ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదని గుర్తుచేశారు. నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందంగా ఉండేదని, ఇప్పుడు జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందని అన్నారు.
దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించే అంశాలన్నీ శాఖలవారీగా మంత్రుల దృష్టికి వస్తుందని, అనంతరం దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని మళ్లీ సదరు సభ్యుడికి తెలియజేస్తామని అన్నారు.
ఈ సభకు ఎలాంటి సమస్యను తీసుకొచ్చారో.. వాటిని పరిష్కరిస్తామని, మళ్లీ దాని గురించి ఆ సభ్యుడికి తెలియజేస్తామనే మాట ఇస్తున్నానని, దీనిపై అనుమానాలు అక్కర్లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అనంతరం కూన రవికుమార్ మాట్లాడారు. మంత్రి నోట్ చేసుకున్న అంశాలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాధానాలు కనీసం తరువాతి సభ సమావేశం అయ్యే నాటికి తమకు తెలియజేసినా తృప్తిగా ఉంటుందని, ఇది తన సలహా మాత్రమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications