జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్- నేడు నిమ్మగడ్డకు అసెంబ్లీ నోటీసులు- రాజ్యాంగ సంక్షోభం తప్పదా ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా వైసీపీ ప్రభుత్వానికీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కూ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్దం ఇవాళ మరో మలుపు తీసుకోబోతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తనపై చేస్తున్న విమర్శల దాడిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి కౌంటర్‌గా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి మంత్రులతో ఫిర్యాదు చేయించిన ప్రభుత్వ పెద్దలు... దీనిపై ప్రివిలేజ్ కమిటీతో చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం తప్పదా అన్న వాదన వినిపిస్తోంది.
నిమ్మగడ్డకు సహాయనిరాకరణ- హైకోర్టు సీరియస్- ప్రస్తుత, గత సీఎస్‌లకు నోటీసులు

జగన్, నిమ్మగడ్డ పోరులో మరో ట్విస్ట్
ఏపీలో తమకు ఇష్టం లేని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఆగ్రహంగా ఉన్న వైసీపీ సర్కారు మంత్రులు, సలహాదారులతో తీవ్ర విమర్శలు చేయిస్తోంది. దీనిపై గవర్నర్‌ను ఆశ్రయించిన నిమ్మగడ్డ వీరు లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆరోపించారు. తనపై విమర్శలకు దిగుతున్న మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఆయన కోరారు. దీంతో మంత్రులు దీన్ని అవమానంగా భావించి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. కమిటీ ఈ ఆరోపణలను విచారించి తదుపరి నిర్ణయం తీసుకోబోతోంది.

అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
కేబినెట్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణపై గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు ఆయా మంత్రుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న ఫిర్యాదుపై ఇవాళ ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.
ఇవాళ ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ఆన్‌లైన్ ద్వారా కమిటీ సమావేశం కానుంది. అనంతరం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు నోటీసులు జారీ చేయబోతోంది. మంత్రులపై చేసిన ఆరోపణలపై నిర్ణీత గడువులోగా ప్రివిలేజ్ కమిటీకి వివరణ ఇవ్వాలని కోరనున్నారు.

రాజ్యాంగ సంక్షోభం తప్పదా ?
రాజ్యాంగ బద్ధ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మరో రాజ్యాంగ బద్ధ సంస్ధ అయిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు ఇప్పించడం అంటే మరో రాజ్యాంగ సంక్షోభాన్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా రాజ్యాంగ సంస్ధల మధ్య విధులు, బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. వీటికి ఎప్పుడైనా భంగం కలిగితే న్యాయస్ధానాలు జోక్యం చేసుకుని పరిష్కారం చూపుతాయి. కానీ కోర్టుకు కూడా వెళ్లకుండానే ఒక రాజ్యాంగ సంస్ధకు మరో రాజ్యాంగ సంస్ధ నోటీసులు జారీ చేయడం సరికొత్త సంక్షోభంగా కనిపిస్తోంది.

నిమ్మగడ్డకు నోటీసులు హైకోర్టు అంగీకరిస్తుందా ?
ఇప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న వ్యవహారంలో హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఉంది. నిమ్మగడ్డకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేయడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డకు కౌంటర్ ఇచ్చేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అస్త్రాన్ని ప్రయోగిస్తే కోర్టు అందుకు అంగీకరిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రభుత్వ న్యాయవాదులే కోర్టుల్లో సమర్ధించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రివిలేజ్ నోటీసుల వ్యవహారంతో వారు మరింత ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది.