ఎపి అసెంబ్లీలో రభస: బాబుపై జగన్ కొత్త ఆరోపణ
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి చేసిన వ్యాఖ్యలు సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించి నరేంద్ర చౌదరి ప్రసంగించారు ఈ సమయంలో వైయస్ రాజశేఖరరెడ్డిపై ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. గాలి జనార్దన్ రెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కొత్త ఆరోపణ చేశారు.
ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావించకుండా వైయస్ కాలంలో ఇలా జరిగింది, అలా జరిగిందని మాట్లాడడం సరి కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అన్నారు. నరేంద్ర చౌదరి వ్యాఖ్యలపై వైయస్ జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
వైయస్ పాలనపై తెలుగుదేశం లేనిపోని ఆభాండాలు వేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడి పాస్ పోర్టు చేక్ చేస్తే ఆయన ఎన్నిసార్లు సింగపూర్ వెళ్లారో తెలుస్తుందని, అలాగే గాలి జనార్దన్ రెడ్డిని కాల్వ శ్రీనివాసులు సింగపూర్ తీసుకెళ్లి చంద్రబాబు ఎన్నిసార్లు భేటీ చేయించారో తెలుస్తుందని జగన్ అన్నారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీకాంత్ రెడ్డి వాటిని నిరూపిస్తారని, నిరూపించలేకపోతే శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేస్తారని, నిరూపిస్తే కాల్వ శ్రీనివాసులు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత వేరే ప్రభుత్వం, వేరే ముఖ్యమంత్రుల పాలన ఐదేళ్లు సాగిందని, టిడిపివాళ్లు మాట్లాడాలనుకుటే సభలో లేని వ్యక్తి, మరణించి సభకు రాలేని వ్యక్తి గురించి మాట్లాడడం కన్నా గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావించి, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఆయన అన్నారు. అయినా ధూళిపాళ్ల వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
దాంతో - స్పీకర్‌కు నోటీసు ఇవ్వకుండా స్పీకర్ అనుమతి లేకుండా సభలో లేని వ్యక్తి గురించి, సభకు రాలేని వ్యక్తుల గురించి మాట్లాడడం ఏమిటని అడిగారు. ఇష్టం వచ్చినట్లు సభ నడిస్తే నిబంధనలు ఉండి ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications