కేసీఆర్! క్షమాపణలు చెప్పాకే ఏపీలో అడుగుపెట్టు: బీఆర్ఎస్‌పై బీజేపీ నేత సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఆయన పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని రాజకీయ పార్టీల నేతల నుంచి సానుకూల స్పందన వస్తుండగా.. మరికొందరి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు ఎదురవుతున్నాయి. జాతీయ పార్టీతో దేశంలో కేసీఆర్ కీలకంగా వ్యవహరిస్తారని కొందరు.. ఆయన పార్టీకి దేశ రాజకీయాల్లో అవకాశం లేదని మరికొందరు అంటున్నారు.

కేసీఆర్ పార్టీకి.. కేఏ పాల్ పార్టీకి తేడా లేదన్న విష్ణువర్ధన్ రెడ్డి
తెలంగాణ, ఏపీ రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే కేసీఆర్ జాతీయ పార్టీపై తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా, ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీ తేడా లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్పష్టమైన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టారన్నారు.

కేసీఆర్ క్షమాపణలు చెప్పాకే ఏపీలో అడుగుపెట్టాలన్న విష్ణువర్ధన్
కేసీఆర్ దోచేసిన సొమ్ముతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లెక్సీలు కడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలుగు తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాతే.. కేసీఆర్ ఏపీలోకి అడుగుపెట్టాలన్నారు. ఎందరో మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ తల్లిని కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఏపీకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. దేశాన్ని ఏకం చేసే కేసీఆర్.. ఏపీలో నీటి ప్రాజెక్టులపై తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీతోనే వివాదాలు ఉన్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారని నిలదీశారు విష్ణువర్ధన్ రెడ్డి.

ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే జరిగేదదేనన్న విష్ణువర్ధన్
మరోవైపు, ఏపీ సర్కారుపైనా విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు, భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదన్నారు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఆరు నెలల్లోనే చేస్తోందని మండిపడ్డారు. జీతాలు రాక ఉద్యోగాలు రోడ్డున పడ్డారన్నారు. దొంగలు లెక్కలు రాయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్రం కొత్త నిబంధనలు పెట్టాల్సి వస్తోందన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. జిల్లాలను కూడా పక్క రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపైనే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తూ.. తమ వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications