గుంటూరు మిర్చికి చైనా షాక్.. సీఎం బయటపెట్టిన సంచలన నిజం
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన మన గుంటూరు మిర్చికి చైనా దేశం షాక్ ఇచ్చింది. మన ప్రాంతం నుంచి చైనాకు ఎగుమతి చేసిన మూడు మిర్చి కంటైనర్లను అక్కడి ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన విషయాన్ని వెల్లడించారు. పల్నాడు జిల్లా లింగంగుంట్లలో జరిగిన 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మిర్చిలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల అవశేషాలు (Chemical Residues) ఎక్కువగా ఉన్నాయనే కారణంతోనే చైనా వాటిని తిరస్కరించిందని సీఎం స్పష్టం చేశారు. కన్నతల్లి లాంటి భూమిని రసాయనాలతో విషతుల్యం చేస్తున్నామని, ప్రపంచ దేశాలు ఇలాంటి పంటలను తిరస్కరిస్తున్న తరుణంలో రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లక తప్పదని పిలుపునిచ్చారు. ఎరువుల విరుగుడుకు ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గమన్నారు.
అన్నదాత సుఖీభవ.. నేరుగా రూ.7 వేల జమ
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.3,125 కోట్ల నిధులను విడుదల చేశాయని, ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేల రూపాయలను జమ చేశామని వెల్లడించారు.

గత పాలకులు రూ.12,500 ఇస్తామని చెప్పి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. గతంలో ధాన్యం అమ్మి నెలలు గడిచినా పైసలు ఇవ్వని పరిస్థితి ఉంటే.. తమ ప్రభుత్వం వచ్చాక కేవలం 48 గంటల్లోనే రైతులకు క్లియర్ చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఆక్వా రైతులకు ఊరట కలిగిస్తూ ఫీడ్ ధరను కిలోకు రూ.4 మేర తగ్గించామని, బర్లి పొగాకును కేజీ రూ.200 కంటే తక్కువకు కొనడానికి వీల్లేదని కఠిన ఆదేశాలిచ్చామని తెలిపారు.
2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి!
రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. "వచ్చే 2027 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తయితే గుంటూరు ఛానల్ ద్వారా చిలకలూరిపేట ప్రాంతానికీ పుష్కలంగా నీరందుతుంది. నల్లమల సాగర్, వంశధార, బనకచర్ల వరకూ గోదావరి జలాలను తీసుకెళ్తాం. ప్రతి ఎకరాకూ నీరు ఇవ్వాలన్న ఎన్టీఆర్ సంకల్పాన్ని నెరవేరుస్తాం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇప్పటికే ఇరిగేషన్ క్యాలెండర్ కూడా విడుదల చేశామన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ 20 లక్షల ఎకరాలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, స్విట్జర్లాండ్ దేశం సైతం మనకు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చిందని గుర్తుచేశారు.
ఏపీలో ఫైటర్ జెట్ల తయారీ.. త్వరలో కూటమి ప్రోగ్రెస్ రిపోర్ట్
గతంలో తాము తెచ్చిన ఐటీ విజన్ వల్ల మన పల్లెటూరి పిల్లలు ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారారని, ఇప్పుడు ఏపీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, సెమీ కండక్టర్ల లాంటి అత్యాధునిక టెక్నాలజీ యూనిట్లను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, డిఫెన్స్, డ్రోన్, ఏరోస్పేస్ రంగాలు వేగంగా వస్తున్నాయని.. త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ గడ్డపై '5వ జనరేషన్ ఫైటర్ జెట్ లు' (5th Generation Fighter Jets) కూడా తయారు కాబోతున్నాయని సగర్వంగా ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే గత పాలకుల విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఇప్పుడు గడచిన రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై త్వరలోనే 'ప్రోగ్రెస్ రిపోర్టు'ను ప్రజల ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications