నౌకాదళంలోకి 'మచిలీపట్నం'! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..
మచిలీపట్నం.. తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. అయితే ఇప్పుడు ఈ మచిలీపట్నం ఇండియన్ నేవీలో చేరింది. మచిలీపట్నం ఏంటి నేవీలో చేరడం ఏంటి అనుకుంటున్నారా.? అక్కడున్న పోర్టును ఇండియన్ నేవీ తీసుకుందేమోలే అనుకుంటే పొరబడినట్లే.. అసలు కథ ఏంటంటే..
భారత విశాల తీరప్రాంత రక్షణలో మన నావికాదళం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల సబ్‌మెరైన్ లను ముప్పుతిప్పలు పెట్టి చెరువులో చేపను వేటాడినట్లు వేటాడే సరికొత్త యుద్ధనౌక నీటిలోకి అడుగుపెట్టింది. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో బుధవారం జరిగిన వేడుకలో 'మచిలీపట్నం' పేరిట రూపొందించిన ఈ ఆధునిక సబ్‌మెరైన్ విధ్వంసక నౌకను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ నౌక చేరికతో భారత్ సముద్ర తీరప్రాంతాల్లో నావికాదళ శక్తి రెట్టింపైంది.

ఎందుకీ పేరు? ఆంధ్రప్రదేశ్‌కే దక్కిన అరుదైన గౌరవం!
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన చారిత్రక నౌకాశ్రయం 'మచిలీపట్నం' పేరును ఈ అత్యాధునిక యుద్ధనౌకకు పెట్టడం తెలుగువారందరికీ గర్వకారణం. ప్రాచీన కాలం నుంచీ విదేశీ వ్యాపారానికి, సముద్ర వర్తకానికి పేరుగాంచిన మచిలీపట్నం నగర ప్రాశస్త్యాన్ని, ఘనమైన నావికా చరిత్రను నిలబెట్టేలా భారత నౌకాదళం ఈ నిర్ణయం తీసుకుంది. శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకు సిద్ధమైన ఈ నావ, తీరప్రాంత రక్షణకు కొత్త సత్తువను ఇస్తుందని సైనిక వర్గాలు తెలిపాయి.
శత్రు జలఅంతర్గాములకు ఇక కాలయముడే!
మాహే శ్రేణికి చెందిన ఈ సబ్‌మెరైన్ వ్యతిరేక నౌక (ASW SWC) సాధారణ నావల కంటే వేగంగా, అత్యంత చాకచక్యంగా పనిచేస్తుంది. సముద్రంలో తక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో సైతం నిశ్శబ్దంగా సంచరించే శత్రువుల సబ్‌మెరైన్‌లను గుర్తించడం, అలాగే బాంబులను నాశనం చేయడం దీని ప్రత్యేకత. అత్యాధునిక రాడార్లు, నీటి లోపల నిఘా పెట్టే సోనార్ వ్యవస్థలు, స్వదేశీ ఆయుధాలతో రూపుదిద్దుకున్న ఈ నౌక మన జల సరిహద్దుల రక్షణలో కీలకంగా మారనుంది.
80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం: 'ఆత్మనిర్భర్' విజయదుందుభి
మన దేశీయ నౌకా నిర్మాణ పరిశ్రమ నైపుణ్యానికి ఈ ప్రాజెక్ట్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇందులో ఏకంగా 80 శాతానికి పైగా భాగాలు పూర్తిగా భారత్‌లోనే తయారయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా 'ఆత్మనిర్భర్ భారత్' మంత్రంతో మన నిపుణులే ఈ పోరాట నావను రూపొందించారు. విదేశాలపై ఆధారపడకుండా సొంతంగానే అత్యున్నత రక్షణ పరిజ్ఞానాన్ని తయారుచేసుకోగలమని భారత్ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
ముమ్మరంగా తీరప్రాంత భద్రత!
కొద్ది రోజుల క్రితమే కొచ్చిన్ షిప్‌యార్డ్ నిర్మించిన 'మాళ్వాన్' అనే మరో యుద్ధనౌకను కూడా నావికాదళం విజయవంతంగా తమ దళంలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని వరుసలోనే ఏడో నౌకగా 'మచిలీపట్నం' ప్రారంభం కావడంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ పట్టు మరింత బిగిస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న ఈ స్వదేశీ యుద్ధనౌకలు భారత సముద్ర సరిహద్దులకు కంటికి రెప్పలా కాపలా కాయనున్నాయి.












Click it and Unblock the Notifications