వంటగది చూస్తే వాంతులే.. రోత పుట్టించే రెస్టారెంట్లు సీజ్!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నట్లుగా.. రుచికరమైన తిండి కోసం నాలికను చాపేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి! మీరు లొట్టలేసుకుంటూ తింటున్న ఆ బిర్యానీలు, నూనెలో తడిసిన ఆ పన్నీర్ కూరలు మీ ప్రాణాల మీదికే తెచ్చేలా ఉన్నాయి. స్టార్ హోటళ్ల గ్లామర్ బోర్డుల వెనుక ఎంతటి మురుగు, ఎంతటి నయవంచన దాగుందో చూస్తే కడుపులో కీలు కదలాల్సిందే!
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్లపై, అపరిశుభ్రత రాజ్యమేలుతున్న హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత శాఖ ఉక్కుపాదం మోపింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే టైంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ విస్తృత తనిఖీల్లో 70 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థల బండారం బయటపడింది. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఏకంగా 25 సంస్థలను అధికారులు అక్కడికక్కడే మూసివేశారు. మొత్తం 30 చట్టపరమైన కేసులు నమోదు చేయగా.. మరో 15 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఈ భయానక తనిఖీల పూర్తి నివేదికను అధికారులు మంత్రి సత్యకుమార్‌కు సమర్పించారు.

ఈ భారీ ఆపరేషన్‌ను ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి. వీరపాండియన్, ఐఏఎం, ఐపీఎం, ఆహార భద్రత శాఖ సంచాలకులు, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం డీజీ సి. అరుణ్‌బాబు ఐఏఎస్‌లు అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించారు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాస్ నేతృత్వంలో 40 మంది ఆహార భద్రత అధికారులు, 13 మంది సహాయ ఆహార నియంత్రణ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించారు.
పూర్తిగా మూతపడిన హోటల్లు..
విజయవాడలోని భవానీపురం క్యాసరోట్ రెస్టారెంట్ వంటగదిలో చూసేవారే హడలిపోయేలా తీవ్ర అపరిశుభ్రత తాండవిస్తుండటంతో అధికారులు దాన్ని వెంటనే మూసివేశారు. అలాగే అనకాపల్లిలోని ఆప్నా పంజాబీ ఢాబా, నెల్లూరులోని పాల్గన్ ఢాబా, పవని రెసిడెన్సీ హోటల్, విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని వాయుపుత్ర టిఫిన్స్ అండ్ మీల్స్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హోటల్ మంజునాథ భవన్ కు తాళాలు పడ్డాయి.
ఈ తనిఖీల్లో బయటపడ్డ విషయాలు సామాన్యులను కంటిమీద కునుకులేకుండా చేసేలా ఉన్నాయి. వంటగదుల్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతుండగా.. వండిన ఆహారాన్ని ఎలాంటి మూతలు, కవర్లు లేకుండా ఫ్రీజర్లలో నెలల తరబడి నిల్వ ఉంచుతున్నట్లు తేలింది. ఇలా వినియోగానికి పూర్తిగా పనికిరాని, కుళ్లిన స్థితిలో ఉన్న 100 కిలోలకు పైగా పాత ఆహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఇక లాభాల కోసం వ్యాపారులు చేస్తున్న అక్రమాలు అన్నీఇన్నీ కావు. కొన్ని సంస్థల్లో అనుమతి లేని కృత్రిమ రంగులను, రుచిని పెంచే ప్రమాదకర రసాయనాలను యథేచ్ఛగా వాడటం గుర్తించారు. అత్యంత దారుణంగా.. స్వచ్ఛమైన పాలకు బదులుగా ప్రమాదకరమైన వెజిటెయిల్ ఆయిల్స్ ఉపయోగించి తయారు చేసిన నకిలీ పన్నీర్‌ను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు తేలింది.
మరోవైపు, ఎలాంటి చట్టబద్ధత లేకుండా చెల్లుబాటు అయ్యే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న 10 సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మొత్తంగా లైసెన్స్ లేనివి, అపరిశుభ్రతతో నడుస్తున్నవి కలిపి 30 కేసులు నమోదు కావడం విస్మయానికి గురిచేస్తుంది. ఈ ఒక్క రోజు దాడులతో తనిఖీలు ముగిసిపోవని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి పెద్ద సంస్థనైనా ఉపేక్షించేది లేదని ఆహార భద్రత శాఖ స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు తమ వంటగదులు, ఫ్రీజర్లు, నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లైసెన్స్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తేల్చిచెప్పింది. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించింది.














Click it and Unblock the Notifications
