కాక్రోచ్ సక్సెస్ తో తెరపైకి మరో ఉద్యమం..! ఇన్ స్టా లో మిలియన్ల సపోర్ట్..!
నీట్ (NEET)సహా జాతీయ స్ధాయి పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ సహా ఇతర అక్రమాలపై యువతలో గూడు కట్టుకుని ఉన్న ఆందోళనకు కార్యరూపం ఇచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ విజయం సాధించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో ప్రారంభమైన కాక్రోచ్ ల ఉద్యమానికి యువత, విద్యార్ధులు భారీ ఎత్తున మద్దతు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ముఖ్యంగా విద్యార్ధుల పార్లమెంట్ మార్చ్ సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు, వీటికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం యువతలో దేశంలో ఎప్పటి నుంచో ఇతర సమస్యల విషయంలోనూ ఆలోచించేలా చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే సీజేపీ ఉద్యమం స్ఫూర్తిగా తీసుకుని సోషల్ మీడియాలో మరో ఉద్యమం ప్రారంభమైంది. అదే రిజర్వేషన్ తొలగింపు ఉద్యమం (Reservation Hatao Andolan). కాక్రోచ్ ఉద్యమం సక్సెస్ అయిన ఇన్ స్టా గ్రామ్ లోనే ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం (RHA) ఊపందుకుంటోందని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. ఈ ఉద్యమానికి కొన్ని రోజుల్లోనే లక్షల నుంచి మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్లు మద్దతుదారులుగా మారినట్లు వెల్లడించింది.

ఇండియా టుడే విశ్లేషణ ప్రకారంఈ ఉద్యమం ప్రచార శైలి, సోషల్ మీడియా వ్యూహాలు, యువతను సమీకరించే విధానం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నీట్ నిరసలను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ ఎప్పుడూ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. పైగా రిజర్వేషన్లను తీసుకొచ్చిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోలతోనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కనిపించారు. కానీ ఇక్కడ సీజేపీ ఉద్యమం తరహా నిరసనల నమూనాను మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమ నమూనాను ఇతర వర్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతున్న తరుణంలో బీజేపీకి ఇది మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ అంశం రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసే అవకాశముందని ఇండియా టుడే అంచనా వేస్తోంది. అదే జరిగితే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరిన్ని కొత్త వ్యూహాల్ని సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే లోక్ సభలో 400 సీట్ల మెజార్టీ లభిస్తే రిజర్వేషన్ ను బీజేపీ ఎత్తేస్తుందని విపక్షాలు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు సీజేపీ ఆందోళనల ముసుగులో మొదలైన ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అందులో భాగమని విపక్షాలు అనుమానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications