శ్రీవారి భక్తులకు 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకం - ప్రముఖ ఆలయాల ఆరా, అమలు..!!
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరి కొత్త పథకం ప్రారంభించింది. శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా శ్రీవారి భక్తుల యాత్రకు భరోసా కల్పిస్తున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. టీటీడీ అమలు చేస్తున్న ఈ పథకం తాము కూడా అమలు చేసేందుకు శబరి మలైలోని ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం అధికారులు టీటీడీతో సంప్ర దింపులు చేస్తున్నారు.
శ్రీవారి భక్తులకు "శ్రీవారి యాత్ర సురక్ష" పథకం ద్వారా యాత్రకు భరోసా కల్పిస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్.. ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చేసి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సీఈవో దొరైస్వామిలతో కలిసి రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు. దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించడం జరిగిందని రవిచంద్ర చెప్పారు. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. గత రెండు నెలల కాలంలో 17 మంది తిరుమలలో మరణించారని, వారిలో 7 మంది కుటుంబ సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని తెలియజేశారు.

టీటీడీ అమలు పై ప్రముఖ ఆలయాల ఆరా
దేశానికి ఆదర్శవంతంగా ఈ బీమా పథకాన్ని తీసుకురావడం జరిగిందని ఏఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. టీటీడీ కోసం శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చేందుకు సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా తిరుమల యాత్ర సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందుతుందని ఎల్ఐసీ సీఈవో దొరైస్వామి వెల్లడించారు. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని చూసి తాము కూడా అమలు చేసేందుకు శబరిమలైలోని ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం అధికారులు తమతో సంప్రదింపులు చేసినట్లు తెలియజేశారు.













Click it and Unblock the Notifications
