"నాన్నను చంపేందుకే అలా చేశారు"-రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ సంచలనం..!
దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురైన ఘటనను ఆయన కుమారుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆనాడు రాజీవ్ ను హత్య చేసే క్రమంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామాన్ని రాహుల్ తాజా వీడియోలో వెల్లడించారు. తల్లి సోనియాగాంధీ ఆటో బయోగ్రఫీ బిలాంగింగ్ ప్రమోషన్ కోసం తీసిన ఓ వీడియోలో సోదరి ప్రియాంక గాంధీ సమక్షంలోనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకుంది. అయితే ఈ హత్యకు ముందే తమకు నాన్న రాజీవ్ ను చంపేస్తారన్న సంకేతాలు ఉన్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ సంకేతాలు అప్పటికే ఉన్నాయని, దాన్ని అడ్డుకునేందుకు ఏమీ చేయలేకపోతే తన తండ్రి రాజీవ్ గాంధీ అంత్యక్రియల కోసం చాలా త్వరలో భారత్ కు రావాల్సి రావచ్చని తన తల్లి సోనియా గాంధీకి అప్పట్లో తాను చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. 1984లో తన నానమ్మ ఇందిరా గాంధీని సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపిన కొన్నేళ్లకు, 1991 మేలో తన తండ్రి అంత్యక్రియలకు విదేశాల్లో ఉన్న రాహుల్ తిరిగి రావాల్సి వచ్చింది. దాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి చేసిన తాజా వీడియోలో రాహుల్.. వారిద్దరూ సోనియా ఆత్మకథపై చర్చిస్తుండగా..
"మా నాన్నను చంపడానికే ఆయన భద్రతను తొలగించారు" అని రాహుల్ ఆరోపించారు. ప్రధాని కాక ముందు విమాన పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ.. తన తల్లి ఇందిర దారుణ హత్య తర్వాత ఆకస్మాత్తుగా ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చింది. అలాగే ఏళ్ల తరబడి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండేవారు. దీన్ని ఆయన ప్రత్యర్దులు ఎగతాళి కూడా చేసేవారు. 1989లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ప్రధాని అయిన వీపీ సింగ్.. కమాండోల రక్షణలో ఆయన ప్రజలకు దూరమైపోయారని విమర్శలు చేసేవారు. 1991లో బీహార్ లో జరిగిన ఓ సభలో రాజీవ్ ఈ విమర్శల్ని అంగీకరించారు. 1984లో తాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే వాడినని, కానీ ప్రధాని అయ్యాక వ్యవస్థ తనపైపట్టు సాధించి తనను బందీని చేసిందని చెప్పుకున్నారు. అలాగే ప్రమాదం ఇంకా పొంచి ఉందని, అది ఏమాత్రం తగ్గలేదన్నారు. కానీ వేరే మార్గం లేదన్నారు. ఓవైపు ప్రచారం చేయాలని, లేదంటే తన భద్రత చూసుకోవాలన్నారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే సందర్భంగా రాజీవ్ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications
