హోదా మోడీకి ఇష్టంలేదు!: బీజేపీ నేత బాంబు, బాబు వ్యూహానికి విలవిల?
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ప్రధాని నరేంద్ర మోడీ సుముఖంగా లేరని బీజేపీ సీనియర్ నేత, ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీ పార్టీ నేతలకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది.
రాష్ట్రంలో ప్రజల మనోభావాలు, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనలు, మిత్రపక్షమైన టిడిపి చేస్తోన్న ప్రకటనలు, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తదితర అంశాలను ఏపీ బీజేపీ నేతలు సిద్ధార్థ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. అందరు కలిసి బీజేపీని దోషిగా నిలబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదానా, ప్యాకేజీ ఇస్తారా తేల్చాలని వారు సిద్ధార్థనాథ్ సింగ్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. ఓ దశలో కోర్ కమిటీ సభ్యుల ప్రశ్నలతో సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రెండేళ్లలో కేంద్రం చాలా ఇచ్చిందని ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారని, దానిపైనా బీజేపీ నేతలు కూడా ప్రశ్నల వర్షం కురిపించారని అంటున్నారు.
అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు మంజూరు చేశారని వారు ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. ఇదే సమయంలో సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీకి హోదా ఇచ్చే అవకాశం లేదని, ప్రధాని మోడీ కూడా అందుకు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది.

ప్యాకేజీ గురించి అడిగితే.. నీతి అయోగ్ రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రధాని దగ్గరకు వెళ్లిందని, ఆయనే ఓ నిర్ణయం తీసుకుంటారని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలను కూడా ఇవ్వాలని వారు కోరినట్లుగా తెలుస్తోంది.
టీడిపికి, విపక్షాలకు కౌంటర్ ఇవ్వాలంటే..
ప్రత్యేక హోదా లేదని చెప్పడంతో ఇప్పటికే మనం ఆత్మరక్షణలో పడిపోయాని, కనీసం ప్యాకేజీ ఇస్తేనైనా టిడిపిని, విపక్షాలకు సరైన సమాధానం చెప్పవచ్చునని వారు సిద్ధార్థనాథ్ సింగ్‌కు చెప్పారని తెలుస్తోంది. ప్యాకేజీ ఇస్తే ప్రజల్లోకి వెళ్లగలమని చెప్పారు.
ఏపీ నేతలకు క్లాస్!
ఏపీ నేతలకు సిద్ధార్థనాథ్ సింగ్ క్లాస్ పీకినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయారని, ఇప్పటికైనా స్వరం పెంచాలని సూచించారని తెలుస్తోంది. అదే సమయంలో హోదా కోసం ఆందోళన ఢిల్లీలో చేయాలని చంద్రబాబు విపక్షాలకు సూచించడాన్ని బీజేపీ కోర్ కమిటీ తప్పుబట్టింది.
టిడిపిని ప్రధానంగా టార్గెట్ చేయొద్దు
మిత్రభేదం వల్ల కాంగ్రెస్, వైసిపిలు లాభపడే అవకాశముందని, కాబట్టి ముఖ్య నేతలు ఎవరు కూడా చంద్రబాబు, టిడిపిని టార్గెట్ చేసుకోవద్దని కూడా సూంచారని తెలుస్తోంది. పార్టీ వైఖరి ఏమిటో అధికార ప్రతినిధులు స్పష్టం చేస్తారని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ చెప్పారు. టిడిపితో దోస్తీగా ఉంటూనే స్వరం పెంచాలని సూచించారు.
బాబు వ్యూహం ఫలించింది!
చంద్రబాబు పన్నిన వ్యూహంలో చిక్కుకుపోయామని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ప్రజల దృష్టిలో బీజేపీ దోషిగా నిలబెట్టే ఆయన ప్రయత్నాలు కొంత సఫలమయ్యాయని వారు భావిస్తున్నారట. ప్యాకేజీ ప్రకటిస్తేనే బాగుంటుందని వారు సూచించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ఇరకాటంలో పెట్టిన విషయం తెలిసిందే. బాబు ధాటికి బీజేపీ విలవిలలాడుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications