సింధూ జలాలు కావాలంటే పాకిస్థాన్ కు ఇదొక్కటే ఆప్షన్: భారత్ సంచలనం
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. నీటిని విడుదల చేయాలంటూ భారత్ కు పాకిస్థాన్ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. కానీ రక్తం- నీరు ఒకేచోట ప్రవహించలేవని భారత్ తేల్చి చెప్పింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సింధూ నది జలాల ఒప్పందంపై అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తన గుడ్ విల్ అండ్ ఫ్రెండ్ షిప్ ను ఇప్పటికే కోల్పోయిందని అన్నారు. సింధూ నది జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ చేస్తున్న బెదిరింపులు కేవలం తమ దేశంలోని అంతర్గత విషయాల నుంచి దృష్టి మరల్చడానికేనని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని పక్కనపెట్టిందని అన్నారు. పాకిస్థాన్ పై వినయ్ క్వాత్రా చేసిన ఈ వ్యాఖ్యలు న్యూస్ వీక్ మ్యాగజైన్ లో ప్రచురితం అయ్యాయి.
ఒకవేళ నిజంగానే పాకిస్థాన్ కు భారత్ తో స్నేహం చేయాలని.. ద్వైపాక్షిక చర్చలు జరపాలని కోరిక ఉంటే ఇప్పటివరకూ పాకిస్థాన్ నిర్మించిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, ఉగ్రవాద సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న గుడ్ విల్ అండ్ ఫ్రెండ్ షిప్ తోనే సింధూ నదీ జలాల ఒప్పందం ఏర్పడిందని కానీ అర్ధ శతాబ్దం నుంచి పాకిస్థాన్ ఆ సంప్రదాయానికి గండి కొట్టిందని అన్నారు. ఇక సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే తెలిపారని పేర్కొన్నారు.

ఉగ్రవాదం అలాగే చర్చలు ఒకేసారి జరగవని.. రక్తం- నీరు ఒకే నదిలో ప్రవహించలేవని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు వినయ్ క్వాత్రా గుర్తు చేశారు. ఇస్లామాబాద్ తన అంతర్గత తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే భారత్ పై యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications