ఏపీ బడ్జెట్ తేదీలో కీలక మార్పు- ప్రాధాన్యత రంగాలు ఇవే?
Chandrababu: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గడువు సమీపిస్తోంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశం కానుంది. రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటుకానున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవి.
గత ఏడాది నవంబర్‌లో నాలుగు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025- 26కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ సైతం ఇదివరకే జారీ అయింది. తొలి రోజున గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తొలుత ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఈ తేదీలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వార్షిక బడ్జెట్‌ను మార్చి 3వ తేదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
27వ తేదీన రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో శాసన మండలి ఎన్నికలు జరుగబోతోండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఇన్‌ఛార్జీ మంత్రులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండకపోవచ్చని, అందువల్లే బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే తేదీలో మార్పు చేశారని అంటున్నారు.
ఈ క్రమంలో 22, 23 తేదీల్లో శాసన సభ్యులకు నిర్వహించ తలపెట్టిన బడ్జెట్ అవగాహన సదస్సు కూడా వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కాగా- ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మొత్తం దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందని సమాచారం.
ఈ కేటాయింపుల్లో ప్రాథమిక విద్య, వ్యవసాయం, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు- ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications