బాలినేని అలకబూనినా..సురేష్ కంటిన్యూ : కోటంరెడ్డి కన్నీరు - అనంత కూర్పులో మార్పు..!!
కేబినెట్ లిస్టులో చివరి నిమిషంలో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. గవర్నర్ వద్దకు జాబితా పంపే సమయంలో ఈ మార్పులు జరిగాయి. తొలుత విడుదల చేసిన జాబితాలో ప్రకాశం జిల్లాకు మంత్రి పదవి కేటాయించలేదు. అక్కడ మాజీ మంత్రులు బాలినేని ..ఆదిమూలపు సురేష్ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసారు.
అయితే, సామాజిక సమీకరణాలతో సురేష్ ను కొనసాగించి..బాలినేనికి పార్టీ బాధ్యత లు ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారు. అయితే, బాలినేని మాత్రం ఇద్దరినీ తప్పించాలని..అవకాశం ఇస్తే ఇద్దరికీ ఇవ్వాలని కోరారు. ఒకరినే కొనసాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ, బాలినేని కోరినా..సురేష్ ను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. దీంతో..బాలినేని అలక బూనారు.

బాలినేని వద్దన్నా..సురేష్ కు పదవి
ఆ వెంటనే సజ్జల ఆయనను బుజ్జగించటానికి బాలినేని ఇంటికి వెళ్లి మంతనాలు చేసారు. కాసేపటికే విడుదల అయిన మంత్రుల జాబితాలో ప్రకాశం జిల్లాకు తొలుత ప్రాధాన్యత లేదు. కానీ, తరువాత సరిదిద్దుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించాలని నిర్ణయించారు.
అప్పటికే 25 మంది మంత్రుల జాబితా బయటకు రావటంతో...అనంతపురం నుంచి మంత్రిగా ఖరారు చేసిన తిప్పేస్వామిని తప్పించారు. ఆయన సైతం ఎస్సీ వర్గానికి చెందిన వారే. అక్కడ నుంచి తొలుత ఇద్దరు మంత్రులను ఖరారు చేయగా.. ఇప్పుడు ఉషాశ్రీ చరణ్ మాత్రమే మంత్రిగా కొనసాగనున్నారు.

కోటంరెడ్డి కన్నీటి పర్యంతం
ఇదే సమయంలో నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే మంత్రి వర్గం లో చోటు దక్కకపోవడమ్ తో బోరున ఏడ్చేసి తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. కానీ, కాసేపటికే ఆయన తనకు తాను సర్దిచెప్పుకున్నారు. తాను ఆవేదన వ్యక్తం చేసాను కానీ..జగన్ తో తోనడుస్తానని స్పష్టం చేసారు..రేపు ఉదయం నుండే గడప గడపకు వైయస్సార్ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారెవరు తన దగ్గరకు రాకండి అంటూ అనుచరులకు శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు.

మాచర్లలో నిరసనలు..అనంతలో మార్పు
ఇక, మాచర్ల లో పిన్నెళ్లికి మంత్రి పదవి ఇవ్వాలంటూ అనుచరులు ఆందోళనకు దిగారు. రోడ్ల పైన టైర్లు వేసి దహనం చేసారు. ఆ మంటల్లోకి ఒక మహిళా అభిమాని దూకే ప్రయత్నం చేయగా..కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి పదవులు ఆశించి రాని..సీనియర్లు ఇప్పటి వరకు ఓపెన్ గా తమ అభిప్రాయాలు స్పష్టం చేయలేదు. అయితే, పాత మంత్రులను సైతం అందరినీ రమ్మని సీఎం జగన్ స్పష్టం చేసారు. దీంతో.. రేపటి మంత్రుల ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రులు ఎవరు హాజరవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications