స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు ఇలా- 8 కేటగిరీలుగా, కేబినెట్ నిర్ణయం..!!
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో, రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక సిఫారసుల ఆధారంగా 8 కేటగిరీలుగా కమిషన్ రిజర్వేషన్ల అమలుకు సిఫారసు చేసింది. వీటి ఆధారం గా కేబినెట్ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. ఈ రాత్రికి రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీంతో.. ఇక ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు లైన్ క్లియర్ అయింది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఏపీలో 50.42 శాతం బీసీ జనాభా ఉన్నట్లు మిశ్రా కమిషన్ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర జనాభా 5.27 కోట్లు ఉండగా అందులో బీసీలు 2.65 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 48.84 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతం బీసీ జనాభా ఉన్నారు. కమిషన్ చేసిన సిఫారసుల మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మంత్రివర్గ సమావేశం లో నిర్ణయించారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. జెడ్పీటీసీలకు 23 శాతం, జెడ్పీ చైర్మన్లకు 26 శాతం రిజర్వేషన్లు కమిటీ సిఫారసుల మేరకు అమలు చేయనున్నారు.

ఎక్కడ అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తగ్గితే.. అక్కడ పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 8 కేటగిరీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది.
పంచాయతీ వార్డు మెంబెర్స్‌లో బీసీలకు 26.73 శాతం, సర్పంచుల్లో బీసీలకు 27.95శాతం, ఎంపీటీసీ 25.55 శాతం, ఎంపీపీల్లో బీసీలకు 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ ఛైర్మన్ 23.08 శాతం, అర్బన్ వార్డు 32.78 శాతం, మున్సిపల్ ఛైర్మన్‌లలో 33.02 శాతం, మేయర్లలో బీసీలకు 35.29 శాతం మేర మంత్రివర్గం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇక.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ఈ రాత్రికి పూర్తి చేసి ఎన్నికల సంఘానికి పంపుతామని స్పష్టం చేసారు. దీంతో.. ఇక ఒకటి, రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయింది.













Click it and Unblock the Notifications
