రాజధానికి 'ఓపెన్': ఏపీ కేబినెట్ నిర్ణయాలివే, అయ్యన్న, గంటాలకు బాబు క్లాస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోర్ కేపిటల్‌ను 350 కిలోమీటర్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీ దాదాపు నాలుగున్నర గంటలు సాగింది. పది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండున్నరకు ముగిసింది. ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాలు... మే 15వ తేదీలోగా రాజధాని భూసమీకరణ పూర్తి చేయాలి. రాజధాని నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలి. కోర్ కేపిటల్‌ను 350 కిలోమీటర్లకు పొడిగించాలి. విజయవాడలో మరో ఐదువేల ఎకరాలు సేకరించాలి. ఆరు జిల్లాల్లో నీరు - చెట్టు కార్యక్రమానికి రూ.26 కోట్లు ఖర్చు చేయాలి.
వారంలో మూడు నాలుగు రోజులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని పర్యవేక్షిస్తారు. మంత్రులు, అధికారులు నీరు - చెట్టు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఇసుక పాలసీలో పారదర్శకత పెంపు కోసం కొత్త చట్టాలు తీసుకు రావాలి. నీరు - చెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.

భోగాపురం విమానాశ్రయానికి 15వేల ఎకరాలు సేకరించాలి. మూడు జిల్లాల రైతులను ఒప్పించేందుకు నలుగురి మంత్రులకు చంద్రబాబు ఆదేశం. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూసమీకరణకు రైతులను ఒప్పించాలని నిర్ణయించారు.
43 శాతం పీఆర్సీ ప్రకారం బకాయిల చెల్లింపుల పైన నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసింది. బకాయిల చెల్లింపుపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. పీఆర్సీకి సంబంధించిన జీవో ఇవ్వాలని కోరారు. ట్యాక్స్, అటవీ హక్కుల చట్టం తదితరాలపై చర్చించారు. రోజ్ వుట్ తరహాలో ఎర్ర చందనానికి కూడా అదే తరహాలో శిక్షా చట్టాలని అమలు చేయాలని నిర్ణయించారు.
కేబినెట్లో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ప్రాజెక్టుల వద్ద నిద్రించి అయినా పనులు వేగవంతం చేస్తానని చెప్పారు. నీరు చెట్టుకు ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేద్దామని చెప్పారు. ఇరిగేషన్ నిధులకు ఎట్టి పరిస్థితుల్లోను కొరత రానివ్వమని చెప్పారు. నీరు - చెట్టు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారని మంత్రి దేవినేని, రావెలను చంద్రబాబు అభినందించారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావులకు చంద్రబాబు క్లాక్ పీకారు. విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించారని సమాచారం.












Click it and Unblock the Notifications