ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం- కీలక నిర్ణయాలు...!!
ఏపీ మంత్రివర్గం అత్యవసర సమావేశం జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పైన ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను న్యాయస్థానం కొట్టి వేసింది. సుప్రీం కోర్టులోనూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించటంతో... ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ పైన చర్చ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లతో పాటుగా స్థానిక ఎన్నికలపై చర్చ కోసం ఏపీ మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది.
స్థానిక ఎన్నికల దిశగా కసరత్తు వేగవంతం అయింది. ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఏపీ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయం పైన సుప్రీంకోర్టు లో అప్పీల్ చేసింది. అక్కడ కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. 50 శాతం పరిమితి కంటే ఎక్కువగా రిజర్వేషన్లకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. దీంతో.. ఈ తీర్పు పైన స్పందించిన సీఎం చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రేపు (శనివారం) ఏపీ మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ భేటీలో సుప్రీం కోర్టు తీర్పుతో పాటుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చించే అవకాశం ఉంది.

తదుపరి నిర్ణయం పై ఉత్కంఠ
స్థానిక ఎన్నికలు ఆలస్యం చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధుల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో, కూటమి పార్టీలు సీట్ల కేటాయింపులో బీసీ రిజర్వేషన్ల అమలు దిశగా నిర్ణయం తీసుకుంటున్నాయి. అదే విధంగా సుప్రీం కోర్టులో పిటీషన్ సమయంలో ప్రభుత్వం కీలక అంశాలను ప్రస్తావించింది. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక కారణాలు.. రాజీవ్ రంజన్ మిశ్రా ప్రస్తావించిన అంశాలను వివరించింది. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో న్యాయ నిపుణులతో చర్చలు చేస్తోంది. కాగా.. ఈ ప్రత్యేక సమావేశంలో తాజా పరిణామాల పైన చర్చించి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ పైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసే విధంగా కసరత్తు జరుగుతోంది.













Click it and Unblock the Notifications
