పెండింగ్‌లో ఉన్న ఒక మంత్రి పదవి అతడికేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి
ఇంకా ఒక మంత్రి పదవి పెండింగ్ లో ఉంది. బీజేపీ నుంచి సత్యకుమార్ మంత్రి పదవిని కేటాయించారు. అమిత్ షాతో అర్థరాత్రి సమయంలో జరిగిన చర్చల్లో సత్యకుమార్ పేరును ఖరారు చేశారు. అయితే తమకు మరో మంత్రి పదవి కేటాయించాలని అమిత్ షా చంద్రబాబును కోరినట్లు సమాచారం. దీంతో ఒక మంత్రి పదవిని బాబు ఖరారు చేయలేదు. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలుంటే తెలుగుదేశం పార్టీ 135, జనసేన 21, భారతీయ జనతాపార్టీ 8 స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 నియోజకవర్గాలకు పరిమితమైంది. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున ఇంకొక పదవిలో ఒకరిని నియమించాల్సి ఉంది.

టీడీపీ సీనియర్ల నుంచి పోటీ
తెలుగుదేశం పార్టీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి సీనియర్లు పోటీపడుతున్నారు. తమ నేతలను దృష్టిలో ఉంచుకొని ఆపారా? లేదంటే బీజేపీ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత వారికి కేటాయిద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు ఆపారా? అనేదానిపై స్పష్టత రాలేదు. బీజేపీకి ఇవ్వాల్సి వస్తే సుజనాచౌదరి లేదంటే కామినేని శ్రీనివాస్.. వీరిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. సామాజికవర్గాలను సమతూకం చేసుకొని పదవులను చంద్రబాబు కేటాయించారు. బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏడు మంత్రి పదవులను కట్టబెట్టగా చంద్రబాబునాయుడు ప్రస్తుతం బీసీలకు ఎనిమిది మంత్రి పదవులిచ్చి గత ప్రభుత్వంకన్నా తమ ప్రభుత్వమే బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications