మహిళల కోసం ఏపీలో మరో సంక్షేమ పథకం: 8 లక్షలకు పైగా ఆ గ్రూపులకు బెనిఫిట్: రూ.6345 కోట్లతో
అమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు లబ్ది కలుగుతుంది. వైఎస్సార్ ఆసరా పేరుతో ఇదివరకే ప్రకటించిన ఈ పథకాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతోన్నారు. దీనికోసం బడ్జెట్‌లో 6345 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి. దీనితో పాటు వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహించబోతోంది.
Recommended Video
ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో సుమారు 1.52 లక్షల స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతలో సుమారు 1186 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేస్తుంది ప్రభుత్వం. ఆసరా కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని వార్డు సచివాలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి జగన్ సర్కార్ చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు అంటే ఈ నెల 17వ తేదీ వరకు వైఎస్సార్ ఆసరా పేరుతో ఈ వారోత్సవాలను నిర్వహించనుంది.

నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నాలుగేళ్లలో 27,168 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ ఏడాది 6345 కోట్లను వ్యయం చేయనుంది. ప్రభుత్వం జమ చేసే మొత్తాన్ని పాత బకాయిలుగా భావించ వద్దంటూ ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకర్లను సూచించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. కొత్తగా జమ కాబోయే మొత్తాన్ని డ్వాక్రా గ్రూపు సంఘాలకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. కిందటి నెల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి ఆమోదం తెలిపింది.
వైఎస్సార్ ఆసరా వారోత్సాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలపైనా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శుక్రవారమే ఈ వారోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులను ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యులను చేసింది. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా వారోత్సవాలను విజయవంతం చేయాల్సి ఉంటుందని ఆదేశించింది.












Click it and Unblock the Notifications