టీడీపీకి మరో షాక్: మీడియా ఇంఛార్జ్ దారపనేని నరేంద్ర అరెస్ట్, చంద్రబాబు ఫైర్
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ మీడియా ఇంఛార్జీ దారపనేని నరేంద్రను సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని యాగంటి అపార్ట్‌మెంట్‌లో ఆయన నివాసం నుంచి బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తులు వచ్చి సీఐడీ అధికారులమని చెప్పి దాదాపు రెండు గంటలపాటు ప్రశ్నించారు.

ఆ కేసులోనే దారపనేని నరేంద్ర అరెస్ట్.. అక్రమ అరెస్టంటూ భార్య
గతంలో గన్నవరం విమానాశ్రయంలో బంగారం తరలింపు వ్యవహారంపై సీనియర్ జర్నలిస్టు అంకబాబు షేర్ చేసిన పోస్టును నరేంద్ర కూడా షేర్ చేశారని, అదే కేసులో సీఐడీ అధికారులు నరేంద్రను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, తన భర్తను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని నరేంద్ర భార్య సౌభాగ్యం మీడియాకు తెలిపారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అధికారులు సమాధానం చెప్పలేదన్నారు. తన భర్తకు ఏం జరిగిన జగన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

భయపెట్టాలనే అరెస్టులు: జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
మరోవైపు, నరేంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ అధికారుల తీరుమారడం లేదని మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్టు అంకబాబు అరెస్టును కోర్టు తప్పుబట్టిందని ఆయన గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పనిచేసే వారిని అరెస్ట్ చేసి భయపెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కేసుల్లో 41ఏ నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడమేంటని చంద్రబాబు నిలదీశారు.

తగిన మూల్యం అంటూ చంద్రబాబు హెచ్చరిక
నోటీసులు ఇవ్వకుండా రాత్రిపూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని అన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులను కోర్టు షోకాజ్ అడిగినా వారి తీరు మారట్లేదని మండిపడ్డారు. ఇందుకు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నరేంద్రను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నరేంద్ర కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications