కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆవేదన, కలిసి పరిష్కరించుకుందాం: కెసిఆర్‌తో బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కాంగ్రెసు పార్టీ తెలుగువారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ఏకపక్షంగా జరిగిన విభజనలో కాంగ్రెసు దోషిగా నిలిచిందని, అందుకే కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారంనాడు కర్నూలు జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు.

విభజనకు, విద్వేషానికి కొన్ని పార్టీలు గుర్తు వస్తే, ఆత్మవిశ్వాసానికి, జాతీయతకు తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుదని ఆయన అన్నారు. ఆత్మవిశ్వాసం గురించి తాను చెబుతూ వచ్చిందని ఆయన అన్నారు. దేశభక్తిలో, జాతీయతలో తెలుగువారికి సాటి ఎవరూ లేరని ఆయన అన్నారు.

దేశం మార్పును కోరుకుందని, దాంతో కేంద్రంలో ఎన్డియె ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ఆయన అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుని పోతామని, దేశ భద్రతను కాపాడుతామని ప్రతిన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న కొంత మందిపై కేసులు ఎత్తివేశామని, మిగతా కేసులను కూడా ఎత్తివేస్తామని ఆయన అన్నారు. మనం కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నామని, తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఐదు ఫైళ్లపై సంతకాలు చేశానని, రుణమాఫీకి ఆ సంతకాలు చేశానని ఆయన చెప్పారు.

15 వేల కోట్ల రూపాయల లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా, పద్ధతి ప్రకారం జరగలేదని ఆయన అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడులను ఇంత కాలం హైదరాబాదులో నిర్వహించుకుని ఇప్పుడు కర్నూలులో నిర్వహించుకోవాల్సి రావడం ఆవేదనగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన దుష్ఫలితాల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో పనిచేయాలని ఆయన సూచించారు.

విభజన వల్ల మన రాష్ట్ర ఎక్కడుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మనం కష్టాల్లో ఉన్నామని, రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదని, అధికారుల నియామకం జరగలేదని ఆయన అన్నారు. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, వాటితో ప్రజలకు పరిస్థితిపై అవగాహన కల్పించడానికి ప్రయత్నించామని ఆయన అన్నారు విభజనపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలను నిందిస్తూ కాలం గడపకుండా ఏం చేయాలనే విషయంపై ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుదామని ఆయన అన్నారు. సంక్షోభంలో అవకాశాన్ని చూసుకోవడం తనకు అలవాటు అని, కష్టాలను అధిగమించగలమని ఆయన అన్నారు. ఏడు మిషన్ల ద్వారా రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తామని ఆయన చెప్పారు.

Chandrababu

పరిశ్రమలు వచ్చినప్పుడే ఉద్యోగాలు, సంపద వస్తాయని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, దాంతో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చునని ఆయన అన్నారు. సేవారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలనే ఆలోచన చేసి సేవారంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ఓ యంత్రాంగాన్ని సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు.

నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చి, అభివృద్ధి చేయడానికి యంత్రాంగాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని, నైపుణ్యంతో ముందుకు పోవాలని, ఫోకస్ అప్రోచ్ తీసుకున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని లాభిసాటిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని, కుటుంబానికి లక్ష రూపాయలు మాఫీ చేస్తామని, భారతదేశంలోనే ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతుల రుణం తీర్చుకున్నామని, ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు.

జలనిర్వహణ ఆధునిక పద్ధతుల్లో చేస్తున్నామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు ఇబ్బంది రాకుండా ఏడు మండలాలను ఎపిలో కలుపుకున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగైదు ఏళ్లలో పూర్తి ఏర్పాటు చేసుకుంటే, కృష్ణా డెల్టాకు నీరు చేరుతుందని ఆయన అన్నారు. రెండు నదులను అనుసంధానం చేస్తే రాయలసీమకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయో ఐదేళ్లలో కరువురహిర రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్‌ను రూపొందిస్తామని, రాయలసీమను సస్యశ్యామలం చేసే పథకాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.

అభివృద్ధికి కరెంట్ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇటీవల కరెంట్ సరఫరాలో ఇబ్బందులు వచ్చాయని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు విద్యుత్తు సమస్య వల్ల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. వారమంతా నిరంతరం కరెంట్ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నామని ఆయన చెప్పారు. టెక్నాలజీని వాడుకుని నాణ్యమైన కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి ఏడు నుంచి 9 గంటలు విద్యుత్తు ఇస్తామని ఆయన చెప్పారు. అక్టోబర్ 2నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు.

ఒకప్పుడు హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, హైదరాబాదును ప్రపంచ చిత్రపటంపై నిలిపి ఉపాధి అవకాశాలు పెంచానని ఆయన చెప్పారు. ఆంద్రప్రదేశ్‌లో జిల్లాకో హైదరాాబాదును, సైబరాబాద్‌ను నిర్మిస్తామని ఆయన చెప్పారు. విశాఖ, అనంతపురం, తిరుపతి, కర్నూలు, విజయవాడలను ఐటి హబ్‌లుగా తయారు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఇంటిలో ఒక్క కంప్యూటర్ లిటరేట్ ఉండాలని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ ప్రజాపంపిణీ, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ప్రవేశపెడుతామని, ప్రైవేట్ అస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని, రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ధరల పెరగదలను అదుపు చేయడానికి ఓ సెల్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ క్యాంటిన్లు పెట్టి పేదలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అవసరమైతే రాత్రి భోజనం ఐదు రూపాయల ధరకే ఇస్తామని ఆయన చెప్పారు. ఐటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

పేదలందరికీ ఇంటి జాగాలు ఇస్తామని, విలువ పెంచే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. వాటర్ గ్రిడ్ తీసుకుని వచ్చి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఎపి దేశంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా తయారు కావాలని ఆయన అన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా అన్ని ప్రాంతాలకు ఐదేళ్లలో నీళ్లు అందిస్తామని ఆయన చెప్పారు. పేదవాళ్లందరికీ గ్యాస్ అందిస్తామని, పైపుల ద్వారా గ్యాస్ కొరత లేకుండా అందిస్తామని ఆయన చెప్పారు.

15 నగరాల్లో 3 సిటీలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. 14 ఓడరేవులు వచ్చే అవకాశం ఉందని, వాటిని అభివృద్ధి చేసుకుని అనుసంధానం చేసుకుంటే బ్రహ్మాండమైన వ్యాపారం సాగుతుందని, ఉపాధి పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలో ఓ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపడుతామని ఆయన చెప్పారు.

రాయలసీమకు బెంగుళూర్, హైదరాబాద్, మధ్యలో ఎపి రాజధాని, చెన్నైలు సమీపంగా ఉంటున్నాయని, రాయలసీమకు ఆ నగరాల నుంచి రవాణా సౌకర్యాలను ఏర్పాటు అనుసంధానం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. రాయలసీమలోని రోడ్లను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయవచ్చునని ఆయన అన్నారు. బీచ్ టూరిజం వస్తుందని, టూరింగ్ స్పాట్స్‌ను పెంచుకోవాలని, దానివల్ల ఉపాధి పెరుగుతుందని ఆయన అన్నారు.

తెలంగాణకు ఇవ్వకూడదని తాను అనడం లేదని, కానీ ఎపికి అన్యాయం జరిగిందని, దాన్ని భర్తీ చేయాలని అంటున్నామని ఆయన అన్నారు. సమస్యలను ఇరువురం కలిసి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ముందుకు రావాలని ఆయన తెలంగాణ ప్రభుత్వనికి పిలుపునిచ్చారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయినా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఇటీవల జరిగిన సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. సమస్యలను కలిసి చర్చించి పరిష్కరించుకుందామని, అలా కానప్పుడు పెద్ద మనిషి వద్ద కూర్చుందామని, ఆలా కూడా జగరగనప్పుడు కేంద్రం వద్ద పరిష్కారం చేసుకుందామని ఆయన అన్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశామని, దానివల్ల ఎంతో మంది పెట్టుబడులు పెట్టారని, అందువల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలును స్మార్త్ సిటిగా రూపొెందిస్తామని ఆయన చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu has hoisted the National Flag at APSP grounds at Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X