ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని ముందు కీలక ప్రతిపాదనలు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సమీకరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర ముఖ్య మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. విభజన హామీలు, రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహాయ సహకారాలను అర్ధించడంతో పాటు, రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన నిధుల విడుదలపై సీఎంతో పాటు కేంద్ర బృందం చర్చించనుంది.
విశాఖ మెట్రో, బీచ్ కారిడార్‌లకు బిగ్ పుష్!
ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరనున్నారు. దీంతో పాటు పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను పరుగులు తీర్పించే 'విశాఖ బీచ్ కారిడార్' ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక అనుమతులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నదుల అనుసంధానం ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రాథమిక చర్యలు ప్రారంభించాలని ప్రధానిని కోరనున్నారు.

కరువు సహాయం, గోదావరి పుష్కరాల నిధులపై వినతులు
ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరనున్నారు. వచ్చే ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అవసరమైన కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను అభ్యర్థించనున్నారు. అదేవిధంగా, ఆర్థిక మంత్రితో జరిగే భేటీలో 'రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్' ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
గోదావరి జలాల వినియోగం.. కేంద్ర మంత్రులతో వరస భేటీలు!
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్. పాటిల్‌తో జరిగే భేటీలో గోదావరి నది నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీరందించే ప్రణాళికలను వివరించనున్నారు. అలాగే రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీలోని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తారు.
తన పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఢిల్లీలో ఏర్పాటు చేసే 'సీఐఐ పార్టనర్‌షిప్ కాన్ఫరెన్స్ కర్టైన్ రైజర్' కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం రాత్రికి సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.














Click it and Unblock the Notifications
