Cyclone Arnab: కేంద్రానికి సాయం కోరిన సీఎం.. అమిత్ షాకు చంద్రబాబు అత్యవసర లేఖ
రాష్ట్రంపై అర్నబ్ తుఫాను చూపిన తీవ్ర ప్రభావం, దానివల్ల వాటిల్లిన నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన ఈ లేఖలో రాష్ట్రంలోని తుఫాను పరిస్థితులను, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలను సీఎం సమగ్రంగా వివరించారు. తుఫాను ధాటికి సంభవించిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాలను ఏపీకి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తుఫాను ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. బాధితులను ఆదుకునేందుకు 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి తీసుకున్న కఠిన చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాకపోవడం పెద్ద ఊరటనిచ్చిందని స్పష్టం చేశారు.

దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు.. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ!
ప్రకృతి కోరలకు చిక్కి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం వివరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 180 ఇళ్లు ధ్వంసమవ్వగా, ప్రధాన రహదారులపై 220కి పైగా భారీ వృక్షాలు కూలిపోయాయి. తీర ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు విద్యుత్ వ్యవస్థ ఛిన్నభిన్నమైంది. ప్రజలు ఇబ్బంది పడకుండా విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించే పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.
దెబ్బతిన్న పంటలు!
భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిపోగా, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
తుఫాను నష్టంపై పూర్తిస్థాయి సమగ్ర అంచనా వేసిన అనంతరం సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని సీఎం తెలిపారు. ప్రసుతానికి క్షేత్రస్థాయిలో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని ఏపీకి పంపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను కోరారు. అలాగే తుఫాను సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం ఇలాగే కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరం అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లాల్లోని పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా చూసిన సీఎం..
ఆంధ్రరాష్ట్రాన్ని అర్నాబ్ తుఫాను వణికిస్తుంది. భారీ వర్షం కురుస్తున్న వేళ సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించారు. అర్నబ్ తుఫాన్ గమనాన్ని... ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎం చంద్రబాబుకు ఆర్టీజీఎస్ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్.. మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎంకు వివరించారు.


Download










Click it and Unblock the Notifications
