"తుఫాన్ లో ఎన్నికలేంటి ? రద్దు చేసి మళ్లీ కొత్తగా.."-సాయిరెడ్డి డిమాండ్..!
ఏపీలో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే.. మధ్యలో అర్ణబ్ తుఫాన్ వచ్చిపడింది. దీని ప్రభావం ఇప్పుడు దాదాపు అన్ని కోస్తా జిల్లాలపైనా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్ధల ఎన్నికల్లో అభ్యర్దులు రోడ్లపైకి వచ్చి ప్రచారం చేసే పరిస్దితి లేకుండా పోయింది. మరోవైపు ఎన్నికల గడువు తరుముకొస్తోంది. దీంతో అభ్యర్దుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్దమవుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఎన్నికల కమిషన్ ముందు కీలక డిమాండ్ పెట్టారు.
అర్నాబ్ తుఫాను వల్ల తీవ్ర నష్టం కనిపిస్తోందని, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రభావం తీవ్రంగా ఉందని ఇప్పటి వరకు వస్తున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. తుఫాను నష్టాన్ని అంచనా వేసి, ప్రజలు-ప్రాంతాలు కుదురుకునేలా చేయటం ప్రభుత్వ టాప్ ప్రయారిటీ కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని తర్వాత నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు సాయిరెడ్డి స్పష్టం చేశారు. సగం రాష్ట్ర ప్రజలు తుఫాను ప్రభావానికి తీవ్ర నష్టానికి గురి అయిన ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తాం అని ముందుకు వెళితే అంతకంటే దిగజారుడు ఉండదన్నారు.

ఎన్నికల వాయిదా పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే గబ్బుపట్టిపోయిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, అర్నాబ్ తుఫాను నుంచి కోలుకున్న తర్వాత, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సాయిరెడ్డి ఇవాళ చేసిన ట్వీట్ లో కోరారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కొనసాగితే ఇబ్బందులు తప్పవు. దీంతో ఎన్నికల కమిషన్ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ మేరకు డిమాండ్ వస్తే అప్పుడు ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













Click it and Unblock the Notifications
