జెడ్పీటీసీల్లోనూ భారీగా ఏకగ్రీవాలు - పులివెందుల సహా వైసీపీ కంచుకోటల్లో కొత్త లెక్కలు..!!
స్థానిక ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాల వేళ పలు మున్సిపాల్టీలను కూటమి ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. కాగా.. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో.. ఎన్నికల సంఘం ఏకగ్రీవాలను ప్రకటించింది. ఇందులోనూ కూటమి పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలతో జెడ్పీటీసీ లను గెలుచుకుంది. వైసీపీకి బలం ఉన్న ప్రాంతాల్లోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవమయ్యాయి. వాటిలో 76 కూటమి దక్కించుకుంది. వాటిలో టీడీపీకి 71, జనసేనకు 2, బీజేపీకి 3 స్థానాలు వచ్చాయి. వైసీపీకి ఒక స్థానం దక్కింది. టీడీపీ ముఖ్య నేతలు తమ వారుసులు పోటీ చేస్తున్న జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా రేసులో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ పెదవేగి మండలం నుంచి టీడీపీ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలిచారు.

మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 39 స్థానాలకు గాను 23 కూటమి దక్కించుకుంది. అదే విధంగా పల్నాడు జిల్లాలో మొత్తం 28 స్థానాలకు గాను 18 కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయితే, జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 టీడీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది.
ఈ నియోజకవర్గంలోని సింహాద్రిపురం, చక్రాయపేట, తొండూరు మండలాలు ఎన్నిక లేకుండానే టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కాగా.. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో 6 స్థానాలు ఉండగా చెన్నూరు, సీకే దిన్నె, వల్లూరు, వీరపనాయనిపల్లె, పెండ్లిమర్రి జడ్పీటీసీలు టీడీపీకి, కమలాపురం జనసేన సొంతం చేసుకుంది. ఇక.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల జడ్పీటీసీలు బీజేపీకి, కొండాపురం జడ్పీటీసీ టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి.
బద్వేలు నియోజకవర్గంలో 7 జడ్పీటీసీ స్థానాలు ఉండగా పోరుమామిళ్ల, బద్వేలు, అట్లూరు టీడీపీ గెలుపొందింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, సిద్ధవటం టీడీపీ ఏకగ్రీవంలో దక్కించుకుంది. ఏకగ్రీవం అయిన మెజార్టీ జెడ్పీటీసీలు సీమ జిల్లాల నుంచే ఉన్నాయి. నంద్యాల, బాపట్ల, ప్రకాశం జిల్లాలోనూ పలు జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.













Click it and Unblock the Notifications
