టెన్త్ పేపర్ల లీకుల్లేవన్న బొత్స-లీకులు అక్కడి నుంచేనన్న జగన్- ఏది నిజం ?
ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రాల లీకుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఓవైపు లీకులు లేవంటున్న ప్రభుత్వం మాస్ కాపీయింగ్ పేరుతో పదుల సంఖ్యలో టీచర్లను అరెస్టు చేస్తోంది. దీనిపైనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో టెన్త్ టెన్త్ ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని, మాస్ కాపీయింగ్ కూడా జరగలేదని నిన్న విద్యామంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. అయితే సీఎం జగన్ దీనికి విరుద్ధంగా లీకులు ఎక్కడి నుంచి వచ్చాయో బయటపెట్టారు. దీంతో ఎవరి వాదన నిజమన్న చర్చ మొదలైంది.

టెన్త్ పేపర్ల లీకేజీల వ్యవహారం
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారం రాజకీయ పోరుకు కారణమవుతోంది. తొలి పరీక్షతో మొదలుపెట్టి వరుసగా బయటపడుతున్న లీకేజీల వ్యవహారం అధికార, విపక్షాల మధ్యవిమర్శలకు కారణమవుతోంది. లీకుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అరెస్టులకు దిగడంతో పరిస్దితి మరింత విషమించింది. అదే సమయంలో ప్రభుత్వం పెట్టిన పాస్ టార్గెట్లతోనే టీచర్లు అక్రమాలకు దిగారన్న వాదన కూడా వినిపించింది. అయితే ఈ వాదనలన్నీ తప్పని విద్యామంత్రి బొత్స నిన్న తేల్చిచెప్పేశారు.

లీకుల్లేవన్న బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో లీకుల ప్రచారంపై విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ నిన్న స్పందించారు. లీకులు లేవని, మాస్ కాపీయింగ్ కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఒకటి రెండు చోట్ల పరీక్షలు మొదలయ్యాక ఫోటోలు తీశారని, దీనికి సంబంధించి ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. గతంలో లేని విధంగా క్రిమినల్ కేసులు నమోదు చేశామని, అరెస్టు చేసిన వారిలో ప్రైవేటు విద్యాసంస్థల వారు 22 మంది ఉంటే,
వారిలో నారాయణ సంస్థ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారని బొత్స తెలిపారు. మిగిలిన వారిలో 36 మంది టీచర్లు. మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారన్నారు. అయినా విపక్షం దుష్ప్రచారం, అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. అర్ధం లేకుండా రాజీనామా డిమాండ్ చేస్తున్నారన్నారు. గతంలో యథేచ్ఛగా ప్రశ్నపత్రాల లీకేజ్‌లు జరిగాయని, చాలా చోట్ల మాస్ కాపీయింగ్‌లూ కొనసాగాయని, అయినా ఎవ్వరిపైనా ఎలాంటి చర్యలు లేవన్నారు. దుష్ప్రచారంతో విద్యార్థులు మనోస్థైర్యం దెబ్బతీయొద్దని కూడా కోరారు. వారి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టొద్దన్నారు.

లీకులు జరిగాయన్న జగన్
మరోవైపు నిన్న విద్యామంత్రి బొత్స చేసిన ప్రకటనకు విరుద్ధంగా సీఎం జగన్ ఇవాళ తిరుపతి సభలో పదో తరగతి పరీక్షల్లో లీకులు జరిగాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే పదో తరగతి పేపర్లు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ల నుంచే పేపర్లు లీక్ అవుతున్నాయంటూ మరో క్లారిటీ కూడా ఇచ్చారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ స్కూళ్లతో పాటు మూడు శ్రీ చైతన్యస్కూళ్ల నుంచి పేపర్లు లీక్ అయ్యాయని జగన్ తెలిపారు. లీక్ చేసిన పేపర్లను వాట్సాప్ లో పెట్టి ఓ వ్యవస్ధను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో పేపర్ల లీక్ ను జగన్ నిర్ధారించినట్లయింది.

సర్కార్ కే క్లారిటీ లేదా ?
విద్యాశాఖ మంత్రి టెన్త్ పరీక్షల్లో లీకుల్లేవని, మాస్ కాపీయింగ్ కూడా జరగలేదని ఓవైపు చెప్తుంటే మరోవైపు సీఎం జగన్ మాత్రం ఎక్కడెక్కడ లీకులు జరిగాయో ఆధారలతో కూడా చెప్పేస్తున్నారు. దీంతో లీకులు నిజమేనని ప్రభుత్వం అంగీకరించినట్లయింది. ఇప్పటికే టీచర్లపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అరెస్టులు చేస్తోందనే ఆరోపణల నేపధ్యంలో లీకుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. అయితే లీకులు జరిగాయనే వాదనను విపక్షాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ కూడా అదే వాదన నెత్తికెత్తుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే విపక్షాలే ఈ లీకులకు కారణమని చెప్పడం ద్వారా ఆయన డొల్లతనం బయటపడినట్లయింది.












Click it and Unblock the Notifications