చంద్రబాబును పక్కనపెట్టి ముందు అతన్ని ఓడించండి: వైఎస్ జగన్
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శతథా ప్రయత్నిస్తోంది. అయితే ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో చంద్రబాబుకన్నా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడిని ఓడించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 'కచ్చితంగా ఆయన్ను ఓడించి తీరండి' అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చింతకాలయ అయ్యన్నపాత్రుడు 2019లో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో 34వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అయ్యన్నను ఓడించడమే ప్రథమ ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుణ్ని, నారా లోకేష్ ను, అచ్చెన్నాయుణ్ని, పయ్యావుల కేశవ్ ను, ధూళిపాళ్ల నరేంద్ర లాంటివారిని ఓడించడానికన్నా ముఖ్యమంత్రి జగన్ అయ్యన్నపాత్రుణ్ని ఓడించడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయ్యన్నపాత్రుడు నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేయడంతోపాటు సెటైర్లు కూడా వేస్తున్నారు. అవన్నీ నేరుగా వైఎస్ జగన్ ను తాకుతున్నాయి. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యన్నపాత్రుడు ఒక ప్రకటన చేశారు. జగన్ పాలన ఎలా వుందో 6 నెలలు వేచిచూస్తానని, బాగుంటే విమర్శలు చేయనని, బాగోలేకపోతే మాత్రం విమర్శలు చేస్తానని ప్రకటించారు.

జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అయ్యన్న
చెప్పినట్లుగానే అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక్క నర్సీపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సందర్భానుసారంగా జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయ్యన్నపై 10 కేసులు నమోదైనా బెయిల్ తెచ్చుకొని బయటే ఉంటూ మరింత విమర్శలు చేస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు చింతకాలయ విజయ్ టీడీపీ సోషల్ మీడియా విభాగాధిపతిగా ఉన్నారు. జగన్ పై విమర్శలు చేయిస్తున్నారన్న ఆరోపణలతో అతనిపై కేసులు పెట్టారు. అయినా అయ్యన్న మాత్రం తన దూకుడును తగ్గించలేదు.

ధీటైన అభ్యర్థి కోసం జగన్ అన్వేషణ?
నర్సీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఈసారి అక్కడ అభ్యర్థిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. గ్రూపు సమస్యలను పరిష్కరించలేకపోవడంతోపాటు ప్రజల్లోను ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ చేయించుకున్న సర్వేలో తేలింది. ఈసారి కూడా ఎలాగైనా అయ్యన్నను ఓడించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ అయ్యన్నపై ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుపుతున్నారు. అయ్యన్న ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications