గ్యారంటీలతో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో - రేవంత్ కు బాధ్యతలు, ముహూర్తం ఫిక్స్..!!
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. టీడీపీ, జనసేన తో ఇప్పుడు బీజేపీ కలవటం పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మరో వైపు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ కు ఏపీ ఎన్నికల ప్రచార బాధ్యత లను కేటాయించింది.
కాంగ్రెస్ మేనిఫెస్టో: ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. చంద్రబాబుతో పాటుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 15 శాతం ఓట్ బ్యాంక్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరగా భారీ స్పందన వచ్చింది.

పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్దులను ఖరారు చేయనుంది. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో పార్టీని గెలిపించిన సంక్షేమ మంత్రా ను ఏపీలోనూ అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ను తిరుపతి కేంద్రంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
రేవంత్ ప్రచారం: ఈ రోజు అనంతపురంలో ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పర్యటించనున్నారు. సీమ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. వచ్చే ఎన్నికల కార్యాచరణ నిర్ణయించనున్నారు. ఈ నెల 25న తిరుపతిలో మేనిఫెస్టో విడుదల సమయంలో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరు కానున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తెలంగాణ సీఎం రేవంత్ కు అప్పగించారు. షర్మిల - రేవంత్ ఇద్దరూ ఏపీలో కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ పెంచే బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించింది.
ఎవరిపై గురి: ఇప్పటికే ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కేంద్రంగా ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ సైతం సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అమలు చేసిన గ్యారంటీలతో ఏపీలోనూ మేనిఫెస్టో విడుదలరే సిద్దం అవుతోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచారం ఏ మేర ఫలిస్తుందీ.. కాంగ్రెస్ దక్కించుకొనే ఓట్ బ్యాంక్ ఎవరికి లాభం చేస్తుంది..ఎవరికి నష్టం చేస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications