అందుకే కోర్టుకు పిలిపించాం..పోలీసులు మీ మాట వినరా - ఏపీ డీజీపీకి హైకోర్టు అక్షింతలు
ఏపీలో పోలీసులు సాధారణ ప్రజలపై వేధింపులకు దిగడంపై హైకోర్టు ఇవాళ తీవ్రంగా స్పందించింది. కర్నూలు జిల్లాకు కల్లూరుకు చెందిన సౌదామిని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. డీజీపీని స్వయంగా పిలిపించి అక్షింతలు వేసింది. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ తమ వాహనాలను అక్రమంగా సీజ్ చేయడంపై సౌదామిని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. డీజీపీని సమాధానం చెప్పాలని నిలదీసింది.
రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా కల్లూరుకి చెందిన సౌదామిని హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రైస్ మిల్లులోని 5 వాహనాలను సీజ్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీజీపీ.. కర్నూలు జిల్లా కల్లూరులోని సౌదామిని రైస్ మిల్ దగ్గర స్వాధీనం చేసుకున్న బియ్యం వాహనాలను విడుదల చేయాలని జేసీకి ఆదేశాలిచ్చారని, ఆదేశాలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. అదే సమయంలో బాధ్యులైన పోలీసుల్ని సస్పెండ్ చేశామన్నారు. అయితే మిగిలిన వారి పరిస్ధితి ఏంటని కోర్టు ప్రశ్నించింది.

పోలీసు వ్యవస్ధలో కిందిస్ధాయి పోలీసులు తమ ఆదేశాలు పాటించకపోవడం వల్ల డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని తెలిపింది. డీజీపీని కోర్టుకు పిలిపించడాన్ని శిక్షగా భావించవద్దని తెలిపింది. డీజీపీ ఆదేశాలను కింది స్ధాయి పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాగైతే పోలీసు శాఖలో క్రమశిక్షణ ఎలా ఉంటుందని డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. ఇదంతా చూస్తుంటే కొందరు అధికారులు లాలూచీ పడుతున్నారని, అందుకే కోర్టులో కేసులు నిలబడటం లేదని ఆక్షేపించింది.












Click it and Unblock the Notifications