విద్యుత్ ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం..!!
విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 17న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు స్ట్రగుల్ కమిటీ ప్రకటించింది. పే రివిజన్, ఇతర సమస్యలకు సంబంధించి ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తున్నారని కమిటీ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. ఎక్కడికక్కడ కార్మిక కమిషనర్లకు తమ అభ్యంతరాలు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పైన ప్రభుత్వంలో సంఘాలతో చర్చలు చేసింది. పర్సనల్ పే నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.2.49 లక్షల దాకా చెల్లించడంతో పాటు ఫిట్‌మెంట్ 7 శాతానికి.. మాస్టర్ స్కేల్‌పై 3.2 శాతం పెంపుదలకు యాజమాన్యం ఆమోదించింది. యాజమాన్యం చేసిన ప్రతిపాదనలకు జేఏసీ అంగీకరిస్తే, క్యాడర్ స్కేల్ ఉద్యోగులకు పర్సనల్ పే అమలు విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపింది. ఇందుకు జేఏసీ అంగీకరించలేదు. ఫిట్‌మెంట్ 15 శాతం కావాలని, క్యాడర్ స్కేల్ ఉద్యోగులకు పర్సనల్ పేకు ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది. మిగిలిన డిమాండ్లలో కూడా యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరింది.

అయితే, తమ డిమాండ్ల సాధన కోసం స్ట్రగుల్ కమిటీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 17న తలపెట్టిన ఛలో విద్యుత్ సౌధ.. ధర్నా కార్యక్రమాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా చెప్పారు. విజయవాడ నగరంలో 144 సెక్షన్, యాక్ట్ 30 అమల్లో ఉందన్నారు. విద్యుత్ వ్యవస్థ అత్యవరస సేవల కిందకు వస్తుందని, ఈ ఆందోళనలో పాల్గొనే వారి పైన ఐసీపీ, ఎస్మా చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆందోళనను ఉప సంహరించుకోవాలని సూచించారు.
ఇప్పుడు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ఛలో విజయవాడ వాయిదా వేసుకోవటంతో టెన్షన్ తప్పింది. ప్రభుత్వం తాము విద్యుత్ ఉద్యోగుల సమస్యపైన సానుకూల ధోరణితో ఉన్నామని చెబుతోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వంలోని ముఖ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications