ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..
ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రభుత్వం.. మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది. చంద్రబాబు వక్రబుద్ధి వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అధికార వైసీపీ మండిపడింది.
ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం వివరణ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలి ఆమోదం లభించకపోవడమే దీనికి కారణమని, జూన్ 30 వరకు ఖర్చులను కూడా గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చేపట్టామని, జులై ఖర్చులకు సంబంధించి మరోసారి గవర్నర్ ఆమోదంతో సమస్యను పరిష్కరించుకుంటామని, అందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందని కల్లం తెలిపారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. శాసనసభ పాస్ చేసిన ద్రవ్య బిల్లు.. మండలిలోనూ ఆమోదం పొంది, తిరిగి శాసనసభకు రాకపోతే.. 14 రోజుల తర్వాతే ఆ బిల్లును అసెంబ్లీ కార్యదర్శే గవర్నర్ కు పంపే వీలుందని, జూన్ 17న మండలిలో ద్రవ్య బిల్లు పెండింగ్ లో పడిపోయిన దరిమిలా బుధవారం(జులై 1) నాటికి 14 రోజుల గడువు పూర్తయిందని, ప్రస్తుతం గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నదని అజేయ కల్లం వివరించారు.
Recommended Video
ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విటర్ లో స్పందించారు. ఉద్యోగులకు వేతనాలు అందకపోవడానికి కారణం టీడీపీ చీఫ్ చంద్రబాబేనని దుయ్యబట్టారు. ''ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకోవడం ద్వారా ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ప్రజలు బుద్ది చెప్పినా తన వక్రబుద్ధి మార్చుకోకుండా.. ప్రజలపైనే కక్ష సాధిస్తున్నాడు. మండలి ఆమోదం అవసరం లేదు.. చంద్రబాబు మోకాలు అడ్డాడు అంతే. ఇంకో మూడు రోజుల్లో సమస్య తొలగిపోతుంది''అని ఎంపీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications