ఏపీ అవతరణ: బాబుకు జగన్ సవాల్, వెంకయ్యపై బూర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు భిన్నంగా వెళ్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన జరపాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నవంబర్ 1వ తేదీనే జరపాలని నిర్ణయించుకుంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అవతరణను నవంబర్ 1న నిర్వహిస్తూ వచ్చారు. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాక... జూన్ 2 రాష్ట్ర అవతరణ నిర్వహించాలని కొందరు, నవంబర్ 1న నిర్వహించారని ఇంకొందరు, మరో తేదీని ఇంకొందరు సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ జూన్ 2న జరపాలని నిర్ణయించుకుంది. కానీ, వైసీపీ మాత్రం రేపే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ తీరు పుట్టిన రోజు, పెళ్లి రోజు మానేసి విడాకుల రోజును పండగలా చేసుకుంటానన్నట్టుందని చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఓ టీవీ డిస్కషన్‌లో ఆయన మాట్లాడారు. విభజన రోజును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా పండుగలా చేసుకోగలరని ప్రశ్నించారు.
భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1న ఏర్పాటు చేస్తే, నవంబర్ 1న మధ్యలో తెలంగాణ కలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవంగా మారిందని, బలవంతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన జూన్ 2న ఎలా రాష్ట్ర అవతరణ దినోత్సవం అవుతుందో చెప్పాలన్నారు.

కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. జుడాలు (జూనియర్ డాక్టర్లు), రాష్ట్ర ప్రభుత్వం గొడవ వల్ల ఆసుపత్రుల్లోని వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కేసీఆర్‌ను ఆయన లేఖలో కోరారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేపడుతున్న భూసేకరణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అక్కడి రైతులను అయోమయంలోకి నెట్టివేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపంచారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, డెవలపర్లకు మాత్రమే లబ్ధి చేకూరేలా జరుగుతున్న ఈ భూసేకరణ కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం 2013ను బేఖాతరు చేస్తోందన్నారు.
ఏపీ మంత్రిగా వెంకయ్య: బూర
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా వెంకయ్య నాయుడు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications