అమరావతి కోసం రూ 10వేల కోట్ల రుణం : హైకోర్టులో ఏపీ ప్రభుత్వం : కొత్త ఆలోచన వెనుక..!!
మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఉప సంహరించుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకుంటూ ఇటీవల చేసిన చట్టం ప్రతుల్ని అఫిడవిట్‌తో పాటుగా కోర్టుకు సమర్పించింది. గత నెలలో ఏపీ ప్రభుత్వం అప్పటి వరకు వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ రద్దు చట్టాల బిల్లులను ఉప సంహరించుకుంటూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఇదే విషయాన్ని రాజధాని కేసులు విచారిస్తున్న న్యాయస్థానానికి నివేదించింది.

ఉపసంహరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం
కానీ, ఆ సమయానికి గవర్నర్ అస్వస్థతకు గురి కావటంతో ఆయన ఆమోదం లభించ లేదు. దీంతో..ఈ నెల 27వ తేదీకి కేసు వాయిదా వేసారు. ఈ సమయంలో ప్రభుత్వం కోర్టు సూచనల మేరకు ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదంతో చట్టమైనట్లుగా డిసెంబరు 13న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అదనపు అఫిడవిట్‌లో పొందుపరిచింది. ఇక, ఇందులో పొందు పరిచిన అంశాలు ఆసక్తి కరంగా మారాయి. ఈ బిల్లుల ఉప సంహరణ సమయంలో మరింత మెరుగ్గా మూడు రాజధానుల బిల్లు సభ ముందుకు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతిలో మౌళిక వసతుల కోసం
అయితే, ఇప్పుడు అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో అమరావతి లో మౌళిక వసతుల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలను వివరించింది. అమరావతిలో పనులు చేసేందుకు 2020లో సీఎం అంగీకారం తెలిపిన విషయాన్ని కోర్టుకు గుర్తు వివరిస్తూ అఫిడవిట్ లో పేర్కొంది.
అమరావతిలో గత అంచనాల ప్రకారం ప్రధాన మౌలిక వసతులపై ఇంకా రూ.13,058.84 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, దాన్ని రూ.4,377.35 కోట్లకు.. రూ.16,223.14 కోట్లతో ఎల్‌పీఎస్ లేఅవుట్‌ల అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని రూ.6715.53 కోట్లకు కుదించి పనులు చేపట్టేందుకు సీఎం అంగీకారం తెలిపారని వివరించింది.

రూ 10 వేల కోట్ల రుణ సేకరణకు నిర్ణయం
మౌలిక వసతుల పనుల్ని దశలవారీగా చేపట్టేందుకు బ్యాంకుల నుంచి మూడంచెల్లో రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. తొలి విడతలో రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని కోర్టుకు నివేదించింది.
కృష్ణా కరకట్ట రోడ్డును కొండవీటివాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నుంచి రాజధానిలోని ఎన్13 రోడ్డు వరకు (మొత్తం 15.525 కి.మీ.లు) విస్తరించేందుకు, బలోపేతం చేసేందుకు రూ.150 కోట్లతో ప్రాజెక్టు చేపట్టామని చెప్పుకొచ్చింది. 14 కోర్టు హాళ్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా మూడెకరాల విస్తీర్ణంలో రూ.33.50 కోట్ల వ్యయంతో హైకోర్టుకు మూడంతస్తుల అదనపు భవనాన్ని ప్రారంభించిన అంశాన్ని వివరించింది.

ప్రభుత్వ ఆలోచనలతో కొత్త చర్చ
దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే నేలపాడులోని హైకోర్టు సమీపంలోనే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేసారు. రాజధాని అమరావతిగా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో దాఖలైన కేసులను న్యాయస్థానం రోజు వారి విచారణ నిర్వహించింది. ఆ క్రమంలో ప్రభుత్వం సడన్ గా మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా న్యాయస్థానం ఆ కేసుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందీ... ఆ తరువాత ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాజధానుల అంశంలో ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications