ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త హాజరు నిబంధన -రోజుకు మూడుసార్లు : ప్రత్యేక యాప్..!!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం - ప్రజల మధ్య వారధిగా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు ఆ సచివాలయాల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో కొత్త హాజరు నిబంధన తీసుకొచ్చింది. ఏ ఇతర ప్రభుత్వశాఖల్లోనూ లేనివిధంగా రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివాలయాల్లో ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ను ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవాలి. రోజూ మూడు సార్లు హాజరు వేసుకోవాలి.

ప్రతీ రోజు మూడు సార్లు హాజరు
ఇందు కోసం మూడు సమయాలను నిర్దేశించింది. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. సొంత ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ ఫోన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.
ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు తమ ప్రొబేషన్ ఖరారు పైన ప్రభుత్వం ఇచ్చిన హామీ పైన ఆశగా ఎదురు చూస్తున్నారు. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు.

ప్రొబేషన్ ఖరారు పైన రాని స్పష్టత
సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే ఏపీపీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించింది. కానీ, చాలా మంది ఉద్యోగులు అందులో ఉత్తీర్ణులు కాలేదు. దీంతో..వారికి ప్రొబేషన్ ఖరారు అవుతుందా లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
ఈ సరిస్థితుల్లో ఉద్యోగులకు ఒక్క రోజులో మూడు సార్లు హాజరు తప్పని సరి చేయటం పైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హాజరు విధానానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించింది.

ఉద్దేశం స్పష్టం చేసిన ప్రభుత్వం
మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ప్రతిరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఉద్యోగులు ఉదయం ఫీల్డ్ కు వెళ్లి..సాయంత్రం వచ్చిన తరువాత హాజరు నమోదు చేస్తున్నట్లుగా అధికారలుు చెబుతున్నారు.
దీంతో..స్పందన నిర్వహించే రెండు గంటల సమయం విధిగా సచివాలయాల్లో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకు రావటం వెనుక ఉద్దేశమని వివరిస్తున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం తరపున అనేక బాధ్యతలు తమకు అప్పగించారని..ఈ సమయంలో రోజుకు మూడు సార్లు హాజరు తప్పనిసరి చేయటం ద్వారా ఒత్తిడి పెంచటమేనని ఉద్యోగులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications