PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించడంలో వైఫల్యం కారణంగా దేశంలో ఎంతో మంది రోజూ చనిపోతున్నారు. అలాంటి వారిని వెంటనే గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తే డబ్బులు కట్టాల్సి ఉంటుందనే కారణంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కేంద్రం తాజాగా ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపింది. ఇందులో రోడ్డు ప్రమాద బాధితుల్ని వెంటనే ఆస్పత్రులకు తరలించే వారికి ఎలాంటి కేసుల్లేకుండా చూడటంతో పాటు పారితోషికం అందించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఆస్పత్రుల్లో చేర్చాక వారి చికిత్సకు లక్షన్నర ఖర్చు భరించేందుకు సిద్ధమైంది.
రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ చికిత్స (PM-RAHAT)
రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రులకు తరలించాక వారికి అయ్యే చికిత్సలో లక్షన్నర వరకూ ప్రభుత్వాలు భరించేలా రూపొందించిన పీఎం-రాహత్ (PM Rahat Scheme)ను కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చింది. దీన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నెట్ వర్క్ ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. పీఎం-రాహత్ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అమలుకు అవసరమైన చర్యలు పూర్తి చేస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ పథకం ట్రస్టు అనుబంధ గుర్తింపు పొంది ఆర్థో, పాలీట్రామా సేవలు అందుబాటులో ఉన్న 687 ప్రైవేట్, 17 ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ వైద్యసేవలో ఏర్పాట్లు
పీఎం-రాహత్ పథకం అమలు కోసం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద బాధితుల ఆర్థిక పరిస్థితులు, స్థానికతతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే అసుపత్రుల్లో చేరినప్పుడు తక్షణ సాయం కింద ఏడు రోజులపాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అసుపత్రులు అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో బాధితులు ఇన్ పేషెంట్లుగా 7 రోజులు పాటు ఆస్పత్రుల్లో ఉండేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ఆస్పత్రులకు వచ్చినప్పుడు ప్రమాద స్థలం, ఇతర వివరాలు ఆన్లైన్ లో నమోదు చేస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం వెళ్తుoది. 24 గంటల్లోగా పోలీసులు ప్రమాద వివరాలపై ఆస్పత్రులకు నిర్ధారణ చేస్తారు. అప్పుడు క్షతగాత్రులకు అందే చికిత్స ప్రమాద కేసుల పరిధిలోనికి వస్తుంది. ఇందుకు అనుగుణంగా చికిత్స, చెల్లింపులు, ఇతర చర్యలు ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతుంది. దీని కోసం నెట్ వర్క్ ఆస్పత్రులకు లాగిన్ సౌకర్యం కల్పించారు. దీంతో ఆయా ఆస్పత్రులు తమ వద్దకు బాధితులు రాగానే ప్రస్తుత విధానంలో మాదిరిగానే లాగిన్ ద్వారా కేసుల వివరాలను ఫ్రీ ఆథరైజేషన్ కోసం పంపాలి. ఇది అందిన వెంటనే 6 గంటల్లో అనుమతులు జారీ చేస్తారు. చికిత్స పూర్తయిన తర్వాత సదరు అసుపత్రుల వారు పంపే వివరాలను ట్రస్టులోని వైద్యుల బృందం పరిశీలించి చెల్లింపులకు ఓకే చెబుతుంది. బీమా సౌకర్యం ఉంటే సదరు బీమా కౌన్సిళ్లకు సమాచారం వెళ్తుంది.

ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు ఇలా
ప్రమాదానికి గురైన వాహనం లేదా ప్రమాదానికి కారణమైన వాహనం బీమా పరిధిలో ఉంటే చికిత్సకు సంబంధించిన బిల్లులు అసుపత్రుల వారు పంపిన పది రోజుల్లో సదరు బీమా కౌన్సెళ్ల ద్వారా చెల్లింపులు చేస్తారు. నిర్ణీత గడువు దాటినప్పటికీ చెల్లింపులు జరగకుండా ఉన్నా, స్పందించకుండా ఉంటే సదరు ఆసుపత్రులకు ఆటోమేటిగ్గా బీమా కౌన్సెళ్ల ద్వారా చెల్లింపులు చేస్తారు. హిట్ అండ్ రన్ కేసుల్లో లేదా ప్రమాదాలకు కారణమైన వాహనాలకు బీమా సదుపాయం లేకుండా ఉంటే... ఆసుపత్రుల వారు సమర్పించిన బిల్లులకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని 'పీఎఫ్ఎంఎస్' (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు సిస్టం) ఖాతా ద్వారా నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో 'పీఎఫ్ఎంఎస్' ఖాతాలు ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రోడ్డు అన్న నిబంధన ఏమీలేదు. అన్ని రకాల రోడ్డు ప్రమాదాలూ దీని పరిధిలోకి వస్తాయి. ట్రస్టు పరిధిలో లేని అసుపత్రులు సైతం పీఎం-రహత్ పథకం కింద చికిత్స అందిస్తే చెల్లింపులు జరుగుతాయి. రోడ్డు ప్రమాద బాధితులకు అసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు ఆసుపత్రుల్లో చికిత్సకు తగ్గ సౌకర్యాలు లేకుంటే అక్కడి వారు రవాణా సౌకర్యాలు కల్పించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రికి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాలి












Click it and Unblock the Notifications