అమరావతి పై సీఎం జగన్ సంచలన నిర్ణయం- ఢిల్లీ వేదికగా..!!
అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. తాజాగా అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలోనూ ముఖ్యమంత్రి జగన్ తమ విధానం ఏంటనేది స్పష్టం చేసారు. వార్డు సచివాలయం నుంచి జిల్లాల మొదలు రాజధానుల వరకు పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తాను అమరావతిలో రాజధాని వద్దని చెప్పటం లేదని.. అమరావతితో పాటుగా విశాఖ - కర్నూలులోనూ రాజధానులు ఉండాలని చెబుతున్నానని వివరించారు. అమరావతి పైన తనకు కోసం లేదని చెప్పుకొచ్చారు. మంత్రులు పదే పదే విశాఖ నుంచి పాలన త్వరలోనే ప్రారంభిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

సుప్రీంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ
తాజాగా.. మంత్రి అమర్నాధ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ప్రారంభం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని..మూడు రాజధానుల నిర్ణయాధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని చెబుతూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పుకు ముందే ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ఉప సంహరించుకుంది. ఆ తరువాత హైకోర్టు అమరావతిలో గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించింది. దీంతో.. ప్రభుత్వం ఆరు నెలల్లో కాదని..అరవై నెలలు సమయం కావాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

శాసనసభకు అధికారం ఉందంటూ
ఇప్పుడు, అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు కారణమైంది. దీంతో..ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు పైన ఇప్పటి వరకు ఆలోచించిన ప్రభుత్వం..ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.
అందులో కీలక అంశాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. రాజధానులపైన చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పటానని తాజా పిటీషన్ లో ప్రశ్నించింది. మూడు రాజధానుల చట్టంలో హైకోర్టుకు జోక్యం చేసుకొనే అధికారం లేదనేది ప్రభుత్వ వాదనగా తెలుస్తోంది. హైకోర్టు విధించిన ఆరు నెలల కాల పరమితిలో అమరావతి అభివృద్ధి అసాధ్యమని చెప్పుకొచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో అభ్యర్దించింది.

అసెంబ్లీకి అధికారం ఉందంటున్న ప్రభుత్వం
అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఎలా చెబుతుందని ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్వవస్థ అధికారాలను నిర్వీర్యం చేసేలా ఉందంటూ ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. ఇప్పుడు దీని పైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందీ అనేది ఉత్కంఠతకు కారణమవుతోంది.
సుప్రీం తీర్పుకు అనుగుణంగానే ఏపీలో రాజధానుల వివాదం..అమరావతి అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్న అధికార పార్టీ నేతలు విశాఖ నుంచి పాలనకు ముహూర్తం సైతం నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు సుప్రీం తీర్పుతో రాజధాని వివాదానికి ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications