సచివాలయాల నిర్వహణ, ఉద్యోగుల పై ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ సచివాలయాల నిర్వహణ.. ఉద్యోగుల బాధ్యతల పైన అధికారులు సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయాల వ్యవస్థ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్ది..అవసరం మేర ఉద్యోగుల సర్దుబాటు చేయాలని భావిస్తోంది. అదే సమయంలో పంచాయితీలతో సచివాలయాలను అనుసంధానం చేస్తూ..పంచాయితీకో సచివాలయం కొనసాగించేలా ఆలోచన చేస్తోంది.
సచివాలయాల ప్రక్షాళన
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు.. వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాలంటీర్ల సేవలను కొనసాగిస్తూనే వారి వేతనాలను రూ 10 వేలకు పెంచుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే నాలుగు నెలల కాలంలో వాలంటీర్ల వేతనాలు ..విధుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వారికి విధుల ఖరారు పైన కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో సచివాలయాల ప్రక్షాళన పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయాల నిర్వహణ ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

పంచాయితీలకు అధికారం
సచివాలయ వ్యవస్థను తొలి నుంచి పంచాయితీ సర్పంచులు వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగుల పైనా పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. వారి పైన నియంత్రణ లేక పోవటం, వారంతా వేర్వేరు శాఖల పరిధిలో పని చేయటం వంటి వంటివి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. పంచాయితీ కార్యదర్శులు కేవలం జీతాల బిల్లులను సమర్పించేందుకే పరిమితం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల సిబ్బందితోనే ప్రతీ నెలా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు అధికారులు వీరి విషయంలో ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు సిద్దం చేసారు.
సిబ్బంది సర్దుబాటు
సచివాలయాల పై సర్పంచులకూ కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా పంచాయితీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఒకే గ్రామం లో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉన్నాయి. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది. ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక.. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా సచివాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications