రెవెన్యూకు షాక్..! సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్దలో ప్రస్తుత కూటమి సర్కార్ కీలక మార్పులు చేస్తోంది. సచివాలయాల ప్రక్షాళన, సిబ్బంది మార్పులతో పాటు వారి విధుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సచివాలయాల సిబ్బంది ప్రతీ సమస్యకూ రెవెన్యూ శాఖ అధికారుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా కీలక సర్కులర్ జారీ చేసింది.
రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో రెవెన్యూ శాఖ సేవల కోసం వచ్చే దరఖాస్తులను డిజిటల్ అసిస్టెంట్లు /వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఎవరి అనుమతి లేకుండానే నేరుగా స్వీకరించి, ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. కొన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా గ్రామ రెవెన్యూ అధికారి (VRO)/వార్డు రెవెన్యూ కార్యదర్శి (WRS)/సర్వేయర్ పరిశీలించకుండా స్వీకరించడం లేదని ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపింది.

ఇది గ్రామ /వార్డు సచివాలయాల ప్రాథమిక లక్ష్యమైన, పౌరులకు వారి ఇంటి వద్దే త్వరితగతిన, పౌరహితస్ఫూర్తితో సేవలను అందించాలన్న ఉద్దేశ్యానికి విరుద్ధమని సర్క్యులర్‌లో పేర్కొంది. కాబట్టి ఈసారి నుంచి రెవెన్యూ శాఖ సేవల కోసం వచ్చే దరఖాస్తులను డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు నేరుగా స్వీకరించి ప్రాసెస్ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. కాబట్టి ఏ పౌరుడు సంబంధిత సేవల కోసం సచివాలయానికి వచ్చినా, VRO/WRS/సర్వేయర్ లేదా ఇతర అధికారుల సూచనలు కోసం వేచి లేకుండా, అన్ని డిజిటల్ అసిస్టెంట్లు / WEDPSలు ఆ దరఖాస్తులను తప్పనిసరిగా స్వీకరించి, ప్రాసెస్ చేయాలనే ఆదేశాలు ఇచ్చారు.

దరఖాస్తులను తిరస్కరించడం, ఆలస్యం చేయడం లేదా షరతులతో స్వీకరించడం పూర్తిగా నిషేధించినట్లు సర్కులర్ లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. జిల్లా కలెక్టర్లు ఈ ఆదేశాల అమలు కోసం సంబంధిత ఫీల్డ్ స్థాయి సిబ్బందికి వెంటనే తగిన సూచనలు జారీ చేయాలని, అలాగే జిల్లా GSWS అధికారులు, DDOలు, MGO/UGOలు తమ పరిధిలోని గ్రామ / వార్డు సచివాలయాల్లో ఈ సూచనలు అమలైందో లేదో చూడాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications