ఉచిత బస్సులో ఏపీ సర్కార్ ట్విస్టులు-అక్కడ లేనట్లే ? కేబినెట్ పైనే ఆశలు..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విషయంలో ట్విస్టులు తప్పడం లేదు. ఈ నెల 15 నుంచి ఈ పథకం అమలుకు సిద్దమవుతున్న ప్రభుత్వం.. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల నివేదికను బయటపెట్టింది. ఇందులో ఉచిత బస్సు పథకం విషయంలో మహిళలకు కొన్ని విషయాల్లో షాకులు తప్పేలా లేవు. అయితే వచ్చే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకూ ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ లు, విజయవాడ, విశాఖలో మెట్రో సర్వీసులు, ఇలా ఐదు రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి మహిళల్ని అనుమతిస్తారు. అయితే బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు ఆందోళన రేపుతోంది. ఇది మహిళలకు ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు అంతర్ రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డు సర్వీసుల్లోనూ మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించవద్దంటూ కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు కూడా ఆయా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి-చెన్నై, అనంతపూర్-బెంగళూర్ మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు తిరుమల ఘాట్ రోడ్డు బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు.

మరోవైపు త్వరలో జరిగే కేబినెట్ భేటీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కోసం తుది మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక త్వరలో జరిగే కేబినెట్ సమావేశం ముందుకు రానుంది. దీనిపై మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు చర్చింంచి తుది నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో అంతర్ రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణికులు కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications