వారి రేషన్ కార్డులు రద్దు, ఆరోగ్య శ్రీ ఇక - కీలక మార్పులు..!!
ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదన పైన కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ.. ఖరారు వేళ కొత్త అంశం ప్రతిపాదిస్తోంది. ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే.. దానికి బదులు గా ఆమేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు. ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్ డీలర్ల వద్దే సరుకులు పంపిణీ చేస్తోంది. కాగా, ఇదే సమయంలో మరో కీలక ప్రతిపాదన వచ్చింది. బియ్యం తీసుకోని వారి కార్డులు వెనక్కు ఇస్తే వారికి నగదు స్థానంలో సరుకులు ఇవ్వాలనే సూచన అందింది. అదే విధంగా ఆరోగ్య శ్రీ కార్డుల పైన కొత్త ప్రతిపాదన పైనా చర్చ జరుగుతోంది.
బియ్యం స్థానంలో నగదు
ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ది దారుల విషయంలో బియ్యం - నగదు పైన చర్చ చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు కోనసీమ పర్యటనలో ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే.. దానికి బదులు గా ఆమేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్ల డించారు. రేషన్ దుకాణా ల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఎవరైన రేషన్ వద్దు అనుకుంటే.. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందిస్తామని తెలిపారు. అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇదే అంశం పైన కీలక చర్చ జరిగింది. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకుని, బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుపై కమిటీ కూలంకషంగా చర్చించింది.

ఆరోగ్య శ్రీతో లింకు వద్దు
రేషన్ కార్డుకు, ఆరోగ్య శ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్ట వచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. బియ్యం అవసరం లేని వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీకి సంబంధం ఉండటంతో చాలా మంది కార్డు తీసుకుని, బియ్యం అమ్ముకుంటున్నారు. రెంటినీ విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని కమిటీ చర్చించింది. స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వెల్ల డించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉంటే 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్‌పై కేంద్రం ఇచ్చేది పోగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,100 కోట్లు ఖర్చు పెడుతోంది. బియ్యం తినని వాళ్లు రేషన్ కార్డులు వెనక్కిస్తే సుమారుగా రూ.2 వేల కోట్లు భారం తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రతిపాదనలు
ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు... దేనికది వేర్వేరుగా ఉంటే బాగుం టుందని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుంది. హెల్త్ కార్డుకు పెద్దగా నిబంధనలు లేకుం డా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేని వారికి నగదు చెల్లిం పులు జరపడం సరికాదు. రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. రేషన్ కార్డుల్లో కోత కాకుండా.. రేషన్ వాడుకోని వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇస్తే మంచిదని సూచించారు. రేషన్ షాపుల్లో మిల్లెట్స్, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా పెట్టొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వానికిస్తామని చెప్పారు. కమిటీ సలహాను స్వీకరించాలా? లేదా? అన్నది ప్రభుత్వం ఇష్టమని రఘురామ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మంత్రివర్గ భేటీలో ఈ కార్డుల అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications