చంద్రబాబు మార్క్ ప్రక్షాళన - బదిలీలు, కీలక నియామకాలు..!!
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన కు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. కొంత కాలంగా బదిలీల పైన చర్చ సాగుతున్నా.. ఇప్పుడు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర స్థాయి తో పాటుగా పలు జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలకు స్థాన చలనం ఖాయం గా కనిపిస్తోంది. ప్రధాన శాఖల అధిపతులు మారనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం పూర్తి కానుండటంతో... అధికారుల పనితీరు ప్రామాణికంగా మార్పులు చేసేందుకు సీఎం చంద్రబాబు సమాయత్తం అయ్యారు.
కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మరో సారి భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఒకే సారి 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అదే విధంగా భారీ స్థాయిలో ఐపీఎస్ బదిలీలు జరిగాయి. పాలనా సౌలభ్యం కోసం మధ్యలో కొందరి అధికారుల బదిలీలు జరిగాయి. ఇక.. ఏడాది పాలన పూర్తయిన తరువాత అధికారుల పనితీరు ఆధారంగా మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ మేరకు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రధాన శాఖల అధిపతుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు బదిలీల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

పలు ప్రధాన శాఖల్లో మంత్రులు - శాఖాధిపతుల మధ్య సమన్వయం సరిగ్గా లేదు. దీంతో, వీరి విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అమరావతి వ్యవహారాలు కీలకంగా మారుతున్నాయి. దీంతో.. రాజధాని పరిధి ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ మార్పు ఖాయం గా కనిపిస్తోంది. ఆరోగ్య, వ్యవసాయ, కార్మిక, విద్యుత్ శాఖల్లోనూ ముఖ్య అధికారులకు స్థాన చలనం కలగనున్నట్లు సమాచారం. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు జిల్లాల ఎస్పీలు మారే అవకాశం కనిపిస్తోంది. కరెక్ట్ ఆఫీసర్ ఇన్ కరెక్ట్ పొజీషన్ అన్న పద్దితిలో అన్నీ పరిశీలించి బదిలీలపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో, ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఉత్తర్వుల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications