కేసీఆర్ ప్రకటనతో జగన్ పై ఒత్తిడి- ఏపీలో 66 వేల ఉద్యోగ ఖాళీలు : భర్తీ పై క్లారిటీ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభలో ఒకే విడతలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసారు. మరో 11 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో..సహజంగానే ఏపీలోనూ దీని పైన చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీకి ఇదే నినాదంతో ర్యాలీగా వచ్చింది. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. దీని పైన అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాల వివరాలను బయట పెట్టింది.

66,309 పోస్టుల ఖాళీ
రాష్ట్రంలోని 33 ప్రభుత్వ శాఖల పరిధిలో మంజూరైన పోస్టులు 7,71,177 ఉండగా, అందులో 5,29,868 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. 2,41,309 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1,75,000 పోస్టులను ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో నిర్వహిస్తోంది. అయినా నికరంగా ఇంకా 66,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేసింది. గ్రామ - వార్డు సచివాలయాల కోసం 1.26 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీ సిబ్బంది 51,488 మందిని రవాణా శాఖలో విలీనం చేసారు.

భర్తీ కేలండర్ ప్రకారం చర్యలు
2021-22 రిక్రూట్‌మెంట్ కేలండర్ ద్వారా 10,143, ఆ తర్వాత వివిధ జీవోల ద్వారా మరో 22,306 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిందని వివరించారు, ఏటా ఖాళీల భర్తీ కోసం జాబ్ కేలెండర్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా..నియామక ప్రక్రియ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రతీ ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే అంశం పైన శాసన మండలిలోనూ చర్చకు సభ్యులు డిమాండ్ చేసారు. ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చినా..నియామక ప్రక్రియ పూర్తి కాకపోవటం పైన వారు ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రకటనతో ఒత్తిడి
ఇప్పటి వరకు 66 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే స్పష్టత ఇవ్వటంతో..ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినవి మినహాయిస్తే..మిగిలిన ఉద్యోగాల భర్తీ పైన నిర్ణయం కోసం ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో భర్తీ ప్రక్రియ ప్రారంభించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక, ఈ రోజు ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ లో ఉద్యోగాల కల్పన పైన ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications