APSRTC: ఆర్టీసీ చార్జీలు, ఉచిత బస్సులపై తేల్చేసిన ఏపీ సర్కార్-మంత్రి ప్రకటన..!
ఏపీలో ఈ సంక్రాంతి సీజన్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రత్యేక బస్సుల ప్రకటన చేసింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో ఓవైపు ఛార్జీల మోత, మరోవైపు ఉచిత బస్సులు అందుబాటులో లేకుండా పోతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలతో పాటు ఉచిత బస్సుల అందుబాటుపై రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని, అలాగే పండుగ సందర్భంగా అదనపు చార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. తద్వారా ఈ రెండు అంశాలపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. అలాగే సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా, క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పండుగ కానుకగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది ఆర్టీసీ చార్జీల్లో ఎలాంటి పెంపు లేదని కూడా ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా అక్రమంగా చార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి ప్రైవేటు ట్రావెల్స్ ను హెచ్చరించారు.

రాష్ట్రంలో పండుగ వేళ ఓవైపు అదనపు బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, మరోవైపు వీటి ప్రభావం ఉచిత బస్సు పథకంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ ను కట్టడి చేసేందుకు ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే వాటిపై ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఈసారి ఏపీలో ప్రయాణికులకు సంక్రాంతి ప్రయాణాల ఇబ్బందులు తప్పినట్లయింది.












Click it and Unblock the Notifications